కోట్లాది భారతీయులనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులను మెప్పించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేటలో మొదటి అడుగు పడింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసిన షార్ట్ లిస్ట్ లో ఎంఎం కీరవాణి స్వరపరిచిన నాటు నాటుకి చోటు దక్కింది. మ్యూజిక్ క్యాటగిరీ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పదిహేను పాటలతో కాంపిటీషన్ కు సై అంది. రేస్ లో బ్లాంక్ పాంథర్, అవతార్ ది వే ఓ వాటర్, ఎవరీథింగ్ ఎవరీవేర్ అట్ వన్స్ లాంటి హాలీవుడ్ క్రేజీ మూవీ సాంగ్స్ పోటీ పడుతున్నాయి. ఇండియా తరఫున అఫీషియల్ నామినేషన్ గా వెళ్లిన గుజరాతీ సినిమా ది లాస్ట్ ఫిలిం షోకు అంతర్జాతీయ ప్రాయోజిత చిత్ర విభాగంలో చోటు దక్కింది.
ఇదింకా మొదటి దశనే. ఆర్ ఆర్ఆర్ ప్రయాణం ఇంకొంత దూరం ఉంది. జనవరి రెండో వారంలో నామినేషన్లకు సంబంధించిన వోటింగ్స్ ఉంటాయి. వీటిని అదే నెల 24న ప్రకటిస్తారు. మార్చ్ 14న జరిగే 95వ అకాడమీ అవార్డ్స్ లో విజేతలు ఎవరో అంగరంగ వైభవంగా జరిగే సంరంభం మధ్య ఆవిష్కరిస్తారు. అప్పటిదాకా కనీసం లీకులు బయటికి రావడం కూడా కష్టమే. ఇప్పటిదాకా ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో లిస్ట్ అయిన మొదటి భారతీయ సినిమా ఆర్ఆర్ఆరే. బరిలో దిగ్గజాల పోటీ ఉన్నప్పటికీ నాటు నాటుకి తగిన గుర్తింపు దక్కుతుందని మూవీ లవర్స్ ఆశపడుతున్నారు. అదంత సులభం కాదు.
కీరవాణి ఎంత గొప్పగా స్వరపరిచినా దానికి సమన స్థాయిలో ఇంకా చెప్పాలంటే దానికి ఎన్నోరెట్లు మించి డాన్స్ తో అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వల్ల వరల్డ్ వైడ్ రీచ్ భారీగా పెరిగింది. మాములుగా దేశీయ బీట్స్ లో సాగే ఇలాంటి పాటలు విదేశీయులను మెప్పించడం కష్టం. అలాంటిది దీనికి ఫారిన్ ఆడియన్స్ సైతం థియేటర్లలో లేచి నిలుచుని నృత్యం చేశారంటే ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫి ఎంతో దోహదపడింది. మరి దిగ్గజాలకే సాధ్యం కానీ ఘనతను కీరవాణి అందుకుంటారో లేదో ఇంకో మూడు నెలల్లో తేలనుంది.