అవును.. నాపై దుష్ప్ర‌చారం చేశారు – హ‌ను రాఘ‌వ‌పూడి

చంద్రశేఖర్ యేలేటి లాంటి మంచి అభిరుచి ఉన్న ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర‌ శిష్యరికం చేసిన అనుభ‌వంతో ‘అందాల రాక్షసి’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హను రాఘవపూడి. గురువు లాగే అత‌ను కూడా తొలి సినిమాలోనే తన అభిరుచిని చాటుకున్నాడు. ఈ చిత్రం కమర్షియల్‌ గా అంత సక్సెస్ కాకపోయినప్పటికీ ఓ వర్గం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.

రెండో సినిమా కృష్ణగాడి వీర ప్రేమ‌గాథ ఉన్నంత‌లో బాగానే ఆడింది. కానీ ఈ రెండూ ఇంకా పెద్ద హిట్ట‌వ్వాల్సిన సినిమాలే కానీ.. సెకండాఫ్ ద‌గ్గ‌ర కొంచెం తేడా కొట్టింది. ఈ సెకండాఫ్ సిండ్రోమ్‌తోనే లై, ప‌డి ప‌డి లేచె మ‌న‌సు దారుణంగా దెబ్బ తిన్నాయి.

దీంతో హ‌ను మీద ఒక నెగెటివ్ ముద్ర ప‌డిపోయింది. అత‌ణ్ని హాఫ్ డైరెక్ట‌ర్ అంటూ సోష‌ల్ మీడియా జ‌నాలు ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఐతే సామాన్య ప్రేక్ష‌కులు సామాజిక మాధ్మమాల్లో ఇలా కామెంట్ చేయ‌డం వేరు.. ఇండ‌స్ట్రీ జ‌నాలు అదే ప‌నిగా వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌డం వేరు.

త‌న‌కు ఇదే అనుభ‌వం ఎదురైందంటూ హ‌ను ఒక ఇంట‌ర్వ్యూలో ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. సీతారామం కంటే ముందు త‌న గురించి ఇండ‌స్ట్రీలో కొంద‌రు దుష్ప్ర‌చారం చేశారని, వాళ్లెవరో కూడా తనకు తెలుసని హను చెప్పాడు. “నా గురించి ఇండస్ట్రీలో జరిగిన ప్రచారం గురించి ‘సీతారామం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో నేనే చెప్పాను. ‘నేను కథ బాగా చెప్తాను, కానీ బాగా తీయను’ అని టాక్ నడిచింది. అలాంటి ప్రచారం ఎందుకు వచ్చిందో తెలియదు. నన్ను నమ్మకూడదు అన్నారట. నమ్మొద్దు అంటే ఏ విషయంలో నమ్మకూడదు. కథ బాగా రాయలేనా.. దర్శకత్వం సరిగా చేయలేనా? నాకు ఇప్పటికీ తెలియదు నా గురించి అలా ఎందుకు అన్నారో? అలా ప్రచారం చేసిన వాళ్లెవ్వరూ కూడా నాకు తెలుసు. ఈసారి వాళ్లను కలిసినపుడు ఎందుకు నా గురించి ఇలా చెప్పారని కచ్చితంగా అడుగుతా” అని హను తెలిపాడు.

తనకు ప్రస్తుతం బాలీవుడ్లో కూడా అవకాశాలు వస్తున్నాయని, కానీ తెలుగు సినిమాలే చేయాలనుకుంటున్నానని.. తర్వాతి చిత్రాలు ‘సీతారామం’ను మించి ఉంటాయని హను ధీమా వ్యక్తం చేశాడు.