వైజాగ్ లో వీరయ్య – సీమగడ్డ పై బాలయ్య

సంక్రాంతికి నువ్వా నేనా అని తలపడుతున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల తాలూకు ప్రమోషన్లు వేగమందుకుంటున్నాయి. చిరు వైపు నుంచి బాస్ పార్టీ ఆల్రెడీ పాతిక మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుండగా జై బాలయ్య పాటతో పాటు తాజాగా సుగుణ సుందరి సాంగ్ తో తమన్ ఫ్యాన్స్ కి జోష్ ఇచ్చే పనిని కొనసాగిస్తున్నాడు. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో రెండూ రిలీజవుతున్న తరుణంలో మైత్రి మూవీ మేకర్స్ షూటింగ్ చివరి దశ పనులను వేగంగా పూర్తి చేసేందుకు పరుగులు పెడుతోంది. ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే పరిస్థితి లేకపోవడంతో బ్యాలన్స్ చేయడమనే సవాల్ ని గట్టిగానే తలకెత్తుకుంది.

ఇప్పుడు అభిమానుల చూపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మీద ఉంది. ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు కానీ ఈ వేడుకలకు సంబంధించి ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. వాల్తేరు వీరయ్యది సముద్ర నేపథ్యంలో జరిగే కథ కాబట్టి దానికి అనుగుణంగా వైజాగ్ ని ఎంచుకున్నట్టు వినికిడి. ఇందుకుగాను స్పెషల్ గా హైదరాబాద్ నుంచి ట్రైన్ వేయించే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. ఇక వీరసింహారెడ్డిది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కాబట్టి సీమగడ్డని సెలెక్ట్ చేస్తారట. కర్నూలులో అఖండకు సంబంధించిన ఈవెంట్ చేశారు కాబట్టి ఈసారి అనంతపూర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇదే ఫైనల్ కావొచ్చు

వాల్తేరు వీరయ్య జనవరి 8న ఈవెంట్ జరిగే ప్రతిపాదన ఉండగా వీరసింహారెడ్డి నాలుగు లేదా ఆరో తేదీకి ప్లాన్ చేయొచ్చు. ఒకే రోజు నిర్వహించడం సాధ్యం కాదు కనక దానికి అనుగుణంగానే సెట్ చేయాల్సి ఉంటుంది. ఒకే ప్రొడక్షన్ ఒకే హీరోయిన్ అయినప్పటికీ మేకింగ్ తో మొదలుకుని పబ్లిసిటీ దాకా ప్రతిదాంట్లోనూ పోటీ కనిపిస్తున్న చిరు బాలయ్య అభిమానులను సంతృప్తి పరిచేలా రెండూ ఒకే రేంజ్ లో జరగాల్సి ఉంటుంది. గెస్టులు ఎవరు వస్తారు లేక వాటిలో చేసిన నటీనటులతోనే మేనేజ్ చేస్తారా లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఒక్కొక్కటిగా రోజులు గడిచేకొద్దీ రానున్నాయి.