తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. గ్రహణం చిత్రంతో అరంగేట్రంలోనే జాతీయ అవార్డు అందుకున్న ఆయన.. ఆ తర్వాత అష్టాచెమ్మా, జెంటిల్‌మ్యాన్, సమ్మోహనం లాంటి చిత్రాలతో మెప్పించారు. ఇటీవలే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఇంద్రగంటి ఆలీ నిర్వహించే ఆలీతో సరదాగా కార్యక్రమంలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కెరీర్ ఆరంభంలో రామ్ గోపాల్ వర్మ తనకు ఒక కథ ఇచ్చి సినిమా తీయించినట్లు ఇంద్రగంటి వెల్లడించడం విశేషం. తనను అత్యంత ప్రభావితం చేసిన సినిమాల్లో శివ ఒకటని.. వర్మ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన మాటలు కఠినంగా ఉన్నా అన్నీ వాస్తవాలే అని ఇంద్రగంటి వ్యాఖ్యానించడం విశేషం.
ఇక తాను దర్శకుడు కావడానికి ముందు చలి అనే షార్ట్ ఫిలిం తీశానని.. అది చూసి వర్మ చాలా మెచ్చుకున్నారని.. అప్పుడే తన దగ్గర ఉన్న ఒక కథను ఇచ్చి… సినిమాగా తీయమన్నాడని ఇంద్రగంటి తెలిపాడు. ఐతే తాను ఆయన చెప్పినట్లే సినిమా తీశానని.. కానీ అది ఆయనకు నచ్చలేదని, తాను సరిగా తీయలేదని ఫీలై దాన్ని పక్కన పెట్టేశాడని ఇంద్రగంటి వెల్లడించాడు.
ఇక చలి షార్ట్ ఫిలింను తాను అప్పట్లో కేవలం 3500తో తీశానని.. దాన్ని సారథి స్టూడియోస్ ఫిలిం క్లబ్‌లో చూసేందుకు వచ్చిన తనికెళ్ల భరణికి కూడా బాగా నచ్చిందని, ఆయనే తనను దర్శకుడిగా మారమని సలహా ఇచ్చారని ఇంద్రగంటి వెల్లడించాడు. అప్పుడు తాను గ్రహణం స్క్రిప్టును చూపించగా, ఆయనకు నచ్చి అందులో ముఖ్య పాత్రలు ఎవరెవరు చేయాలో కూడా చెప్పారని.. ఆరు లక్షల ఖర్చుతో ఆ సినిమా తీశానని.. డిజిటల్లో తీసిన ఆ సినిమాను ఫిలింగా మార్చడానికి 11 లక్షలు అయిందని.. దాన్ని నేషనల్ అవార్డులకు పంపితే పురస్కారం దక్కడం పెద్ద షాక్ అని ఇంద్రగంటి తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates