నాకు ఒక అమ్మాయి ఉంటే అనుపమ లాగే ఉండాలి

సినిమా వేడుకల్లో ఒకరినొకరు పొగుడుకోవడం మామూలే. ఇక హీరో హీరోయిన్లకు ఈ వేడుకల్లో ఇచ్చే ఎలివేషనే వేరుగా ఉంటుంది. నటన గురించే కాక వారి వ్యక్తిత్వాన్ని కూడా తెగ పొగిడేస్తుంటారు. కానీ అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. అదే పనిగా ఎవరినీ పొగడరు. ఊరికే విశేషణాలు జోడించకుండా, అతిశయోక్తులు లేకుండా అవతలి వాళ్లకు ఎలివేషన్ ఇస్తుంటారు. తనకు నచ్చిన వాళ్ల గురించి ఆయన నిజాయితీగా తన అభిప్రాయం చెబుతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి నుంచి మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ చాలా పెద్ద కాంప్లిమెంట్సే అందుకుంది.

తనకు ఒక కూతురు ఉంటే అనుపమ లాగే ఉండాలని కోరుకుంటానని.. ఆమె అంటే తనకు అంత ఇష్టమని అల్లు అరవింద్ చెప్పడం విశేషం. తన ప్రొడక్షన్లో అనుపమ కథానాయికగా నటించిన ‘18 పేజెస్’కు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్లో అరవింద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సినిమా గురించి తక్కువ మాట్లాడిన అరవింద్.. అనుపమ గురించి మాట్లాడకుండా ఉండలేనంటూ ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అనుపమ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక అమ్మాయి ఉంటే అనుపమ లాగే ఉండాలని అనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి. తను చాలా పారదర్శకంగా ఉంటుంది. ఏమాత్రం నటన ఉండదు. ఏదనిపిస్తే అది ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారు. అందుకే ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం’’ అని అనుపమను కొనియాడారు అరవింద్.

ఈ మాటలకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన అనుపమ.. అరవింద్‌కు థ్యాంక్స్ చెప్పి ఆయన కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంది. అరవింద్ లాంటి వ్యక్తి ఇలాంటి కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే అనుపమ తన వ్యక్తిత్వంతో ఆయన్ని ఎంతో ఆకట్టుకున్నట్లే. నిఖిల్ హీరోగా సుకుమార్ కథతో పల్నాటి సూర్యప్రతాప్ రూపొందించిన ‘18 పేజెస్’ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.