హరీష్ శంకర్-జీవిత.. ‘తెలుగు’ డిబేట్

తెలుగు సినిమాల్లో ఎప్పుడూ తెలుగు హీరోలే నటిస్తారు. మిగతా పాత్రల్లో చాలా వాటికి తెలుగు నటుల్నే తీసుకుంటారు. కానీ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం ఇతర భాషల భామల వైపు చూస్తారు. రకరకాల కారణాల వల్ల తెలుగు హీరోయిన్లు మన దగ్గర అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు.

అవకాశాలు అందుకోలేకపోతున్నారు. ఈ మధ్య తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యం మరింత తగ్గిపోతోంది. ఇలాంటి టైంలో రాజశేఖర్ కూతుళ్లయిన శివాని, శివాత్మిక హీరోయిన్లు అయ్యారు. వారి కెరీర్లు అనుకున్నంత స్థాయిలో ముందుకు కదలట్లేదు.

ఈ పరిస్థితుల్లో తన చిన్న కూతురు Shivathmika కీలక పాత్ర పోషించిన ‘Panchatantram’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో జీవిత.. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ శంకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగు హీరోయిన్లు, ఆర్టిస్టులను ప్రోత్సహించాలని కోరారు. హరీష్ శంకర్ దీనిపై ఆసక్తికర రీతిలో స్పందించాడు.

తెలుగు వారికి తన సినిమాల్లో ప్రాధాన్యం ఇవ్వడానికి సాధ్యమైనంతగా ప్రయత్నిస్తున్నానని.. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఈ విషయంలో పూర్తిగా న్యాయం చేయలేక పోతున్నందుకు క్షమించాలని హరీష్ శంకర్ వ్యాఖ్యానించాడు. “ఓ రచయితగా తెలుగు వారినే వివిధ పాత్రలకు ఎంపిక చేయడానికి నేను ఇష్టపడతా. అప్పుడప్పుడు నేను ఫస్ట్ టేక్ తర్వాత రెండో టేక్‌కు డైలాగ్ మారుస్తుంటా. అలా చేస్తే ముంబయి నుంచి వచ్చిన వాళ్లు మళ్లీ ప్రాక్టీస్ చేయడం కోసం టైం అడుగుతుంటారు. కానీ తెలుగు వాళ్లుంటే ఈ సమస్య ఉండదు.

సెట్లో మొత్తం తెలుగు వాళ్లే ఉండాలని నేను అనుకుంటా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మన వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నందుకు క్షమించాలి. ‘గద్దల కొండ గణేష్’లో తెలుగ అమ్మాయి అయిన డింపుల్ హయతితో ఒక పాట చేయిస్తే ఆమె ఇప్పుడు బిజీ హీరోయిన్ అయింది” అని హరీష్ శంకర్ పేర్కొన్నాడు. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ‘పంచతంత్రం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.