బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అక్షయ్ కుమార్‌కు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. గత ఏడాది సుదీర్ఘ విరామం తర్వాత ఉత్తరాదిన పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకున్నాక పెద్ద స్థాయిలో రిలీజ్ అయిన ‘సూర్యవంశీ’ సినిమాతోనే బాలీవుడ్ రివైవ్ అయింది. అప్పుడు అందరూ అతణ్ని సేవియర్ అన్నారు. కానీ ఆ ఊపును తర్వాత అక్షయ్ కొనసాగించలేకపోయాడు. ఈ ఏడాది ఒకటి రెండు కాదు.. ఐదు డిజాస్టర్లను అతను ఖాతాలో వేసుకున్నాడు.
థియేటర్లలో రిలీజైన బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు.. ఓటీటీలో విడుదలైన కట్ పుట్లి అతడికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. దీంతో ఒక్కసారిగా అక్షయ్ కుమార్ కెరీర్ ప్రమాదంలో పడ్డట్లు కనిపించింది. స్వయంగా అభిమానులే అతణ్ని డిస్ ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో ట్రెండుకు తగ్గట్లుగా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేద్దామని ఛత్రపతి శివాజీ కథను లైన్లో పెట్టాడు.
మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా నుంచి చిన్న వీడియో గ్లింప్స్‌ను మంగళవారమే రిలీజ్ చేశారు. ఇలా సినిమా అనౌన్స్ అయిందో లేదో కాసేపటికే ట్రోల్స్ మొదలైపోయాయి. ఒక రాజమహల్‌లో అక్షయ్ నడిచి వస్తున్న వీడియోలో వెనుక ట్యూబ్ లైట్లతో కూడిన భారీ జూమర్ ఈ ట్రోల్స్‌కు కారణమైంది.
శివాజీ బతికి ఉన్న కాలానికి ప్రపంచంలో ఎక్కడా విద్యుత్ కానీ, ట్యూబ్ లైట్ కానీ లేవు. అప్పటికి థామస్ అల్వా ఎడిసన్ బల్బునే కనిపెట్టలేదు. మరి ఆ కాలంలో సినిమా తీస్తూ ఇప్పటి టెక్నాలజీ జూమర్‌ను ఏర్పాటు చేయడం ఏంటి.. ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా అంటూ నెటిజన్లు ఈ చిత్ర బృందాన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలే ఈ మధ్య ప్రతి చిన్న విషయానికీ ట్రోల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సినిమాల మీద నెగెటివిటీని పెంచడానికి ఒక వర్గం కాచుకుని ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక లోపం కనిపించేసరికి అక్షయ్ సినిమా మీద నెటిజన్లు పడిపోతున్నారు.