డేంజర్ జోన్లో దిల్ రాజు


టాలీవుడ్లో పక్కా ప్లానింగ్‌తో సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకడు. మహామహులైన నిర్మాతలు సినిమాల నిర్మాణం రిస్కీగా మారిన పరిస్థితుల్లో దుకాణం సర్దేసి వెళ్లిపోతుంటే, కొత్తగా వచ్చే నిర్మాతలు కూడా ఎక్కువ కాలం నిలబడలేక వెనక్కి తగ్గుతుంటే రాజు మాత్రం క్యాల్కులేటెడ్‌గా సినిమాలు తీస్తూ మంచి సక్సెస్ రేట్‌తో ముందుకు సాగుతున్నారు. పెద్ద హీరోలతో భారీ బడ్జెట్లో సినిమాలు తీసినా సరే.. తన లెక్క కరెక్ట్‌గా ఉంటుందని, బడ్జెట్-బిజినెస్ అన్నీ కట్టు తప్పకుండా ఉంటుందని రాజు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో క్లియర్‌కట్‌గా చెప్పాడు.

ఐతే అన్నీ పక్కాగా స్కెచ్ గీసుకుని పని చేసే రాజుకు ఆయన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న రెండు చిత్రాలు కొంచెం ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి వారసుడు కాగా.. ఇంకోటి రామ్ చరణ్-శంకర్ సినిమా. చరణ్ సినిమా అనుకున్న దాని కంటే ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ పెరిగిందని స్వయంగా రాజే వెల్లడించాడు.

ఇక ‘వారసుడు’ విషయానికి వస్తే హీరో విజయ్ ఒక్కడికే వంద కోట్లకు పైగా రాజు పారితోషకం ఇచ్చినట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి తన ప్రతి చిత్రానికీ కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టిస్తారు. ఊపిరి, మహర్షి లాంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ‘వారసుడు’ విషయంలోనూ అదే జరిగింది. పారితోషకాలు ఎక్కువ. బడ్జెట్ పెరిగింది. మొత్తంగా రాజు ఈ విషయంలో రాజు వేసుకున్న ప్రణాళిక ఫలించలేదని తెలుస్తోంది. సినిమాకు తమిళం ఉన్న క్రేజ్ వల్ల అక్కడ మంచి బిజినెస్సే జరిగినా.. డిస్ట్రిబ్యూటర్లలో టెన్షన్ అయితే లేకపోలేదు.

సంక్రాంతికి పోటీగా ‘తునివు’ లాంటి సాలిడ్ మూవీ వస్తోంది. వంశీ కంటే హెచ్.వినోద్‌ను ట్రేడ్ ఎక్కువ నమ్ముతోంది. ‘తునివు’ ముందు ‘వారిసు’ నిలుస్తుందా అనే సందేహాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాజు చేతిలో థియేటర్లు ఉండడం వల్ల మంచి రిలీజ్ దక్కొచ్చు కానీ.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల పోటీని తట్టుకుని విజయ్ సినిమా ఏమాత్రం నిలుస్తుందనే సందేహాలున్నాయి. ఇలా రెండు భాషల్లోనూ ‘వారసుడు’కు సవాలు తప్పట్లేదు. నిర్మాతగా రాజు డేంజర్ జోన్లో ఉన్నట్లే కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఆయన్ని ఎంతమేర బయటపడేస్తుందో చూడాలి.