కరోనా వేళ దేశంలోని మిగతా సినిమా స్టార్లను మించి పెద్ద స్టార్‌గా అవతరించాడు సోనూ సూద్. దేశమంతా అతణ్ని రియల్ హీరో అని పొగిడింది. లాక్ డౌన్ వేళ రవాణా సౌకర్యాలు ఆగిపోయి, ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతూ దయనీయ స్థితిలో కనిపించిన వలస కార్మికులను ప్రభుత్వాలు కూడా పట్టించుకోని స్థితిలో సోనూ సూద్ ముందుకు వచ్చి సొంత ఖర్చుతో వేలాది మందిని స్వస్థలాలకు పంపించాడు. ఇందుకోసం అతను పడ్డ శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే. డబ్బులు పెట్టడానికి మించి అందులో అతను చూపించిన కమిట్మెంట్ చాలా గొప్పది. ఇప్పుడు ఆ అనుభవాలన్నింటిపై సోనూ పుస్తకం రాయబోతుండటం విశేషం.
వలస కార్మికులతో మాట్లాడే సమయంలో వారి కష్టాలను విన్న సోనూ.. ఆ అనుభవాలను పుస్తకంలో పొందుపరిచేందుకు రచయిత అవతారం ఎత్తనున్నారు. ఈ మూడున్నర నెలలు రోజుకు
16-18 గంటల పాటు వలస కార్మికుల కష్టాల మీదే పని చేసిన సోనూకు వారి బాధలు కదిలించాయని చెప్పాడు. కూలీలను సొంత గ్రామాలకు తరలించే సమయంలో వారు పొందిన ఆనందం.. సంతృప్తి, సంతోషాన్ని ఇచ్చిందని,
ఆ చిరునవ్వులు ప్రత్యేకమైన అనుభవాన్ని ఇచ్చాయని అన్నాడు. వలస కార్మికులకు సాయం చేసే అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపిన సోనూ.. ‘లైఫ్ చేంజింగ్’ పేరుతో పుస్తకం తీసుకొస్తున్నట్లు చెప్పాడు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించనుందని వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates