రాజమౌళి-మహేష్.. హాలీవుడ్ టచ్


‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’కు ఎంత హైప్ వచ్చినా సరే.. ‘బాహుబలి’ మ్యాజిక్‌ను రిపీట్ చేయడం కష్టమనే చాలామంది భావించారు. ఇండియాలో ఈ సినిమా రిలీజైనపుడు కూడా రివ్యూలు, ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ కూడా అందుకు తగ్గట్లే కనిపించింది. కానీ టాక్ అంత గొప్పగా లేకపోయినా ఈ సినిమా ఇండియాలోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లే సాధించింది.

ఐతే ఫస్ట్ రిలీజ్‌లో ఈ సినిమాకు వచ్చిన రిసెప్షన్, వసూళ్ల సంగతి పక్కన పెడితే.. నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ రిలీజ్ అనంతరం వచ్చిన అప్రిసియేషన్, రీచ్ అంతా వేరే లెవెల్ అనే చెప్పాలి. అక్కడ ఈ సినిమా చూసి నేటవ్ అమెరికన్స్ ఫిదా అయిపోయారు. వాళ్ల రెస్పాన్స్ చూసి అమెరికాలో మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ను రీ రిలీజ్ చేస్తే థియేటర్లు హోరెత్తిపోయాయి. ఈ దెబ్బతో రాజమౌళి ఇమేజ్ తిరుగులేని స్థాయికి చేరుకుంది. ఆయన ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ అవార్డుకు కూడా రేసులో ఉన్నారు.

రాజమౌళికి గత కొన్ని నెలల్లో వచ్చిన పేరు ప్రఖ్యాతులు చూసి హాలీవుడ్‌కు చెందిన పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా జక్కన్నతో సినిమా తీయడం వెంటనే సాధ్యం కాకపోవచ్చు కానీ.. మహేష్ బాబుతో ఆయన తీయబోయే తర్వాతి సినిమాతో అసోసియేట్ కావడానికి ఒక ప్రఖ్యాత హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సిద్ధమైనట్లు సమాచారం.

రాజమౌళి-మహేష్ సినిమాను సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించనుండడం తెలిసిందే. ఎప్పుడో తాను నారాయణకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ జక్కన్న ఇప్పుడు ఆయనకు సినిమా చేయబోతున్నారు. ఐతే నారాయణ డీలింగ్ అంతా తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం. ఇండియాలోని మిగతా భాషల్లో వేర్వేరు నిర్మాణ సంస్థలు అసోసియేట్ అయ్యే అవకాశముంది. ఇక అంతర్జాతీయంగా ఈ చిత్రాన్ని ఒక హాలీవుడ్ నిర్మాణ సంస్థ రిలీజ్ చేయనుందట. ప్రమోషన్లు, డిస్ట్ర్రిబ్యూషన్ మొత్తం ఆ సంస్థే చూసుకోబోతోందని సమాచారం.