సంక్రాంతికి ఆట్టే టైం లేదు. నలభై రోజులు ఇలా కళ్ళు మూసి తెరిచే లోపు కరిగిపోతాయి. పైగా ఈసారి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఆయా హీరోల అభిమానులు ప్రమోషన్ల మీద విపరీతమైన అంచనాలు పెట్టేసుకున్నారు. వాల్తేర్ వీరయ్య నుంచి బాస్ పార్టీ పాట చార్ట్ బస్టర్ అయ్యాక టీమ్ సైలెంట్ అయిపోయింది. అదే బ్యానర్ నుంచి వస్తున్న వీరసింహారెడ్డి జనవరి 12 లాక్ చేసుకుంది. విజయ్ వారసుడుతో ఒకే రోజు ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యింది. కానీ మెగా మూవీ తాలూకు రిలీజ్ అప్డేట్ ఇప్పటిదాకా అఫీషియల్ గా బయటికి రాలేదు. పదమూడనే లీకే అన్నిచోట్లా చక్కర్లు కొడుతోంది.
రవితేజ తాలూకు క్యారెక్టర్ టీజర్ సిద్ధం చేశారని ఆదివారం వదులుతారనే టాక్ వచ్చినా అదీ జరగలేదు. పోనీ ఇవాళ ఏమైనా ఇస్తే ఫ్యాన్స్ అదృష్టం అనుకోవాలి. ఎల్లుండి నుంచి పాట చిత్రీకరణ కోసం చిరు బృందం రష్యా వెళ్తోంది. ఆలోగా ఏదైనా హడావిడి జరిగితే మంచిదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ మైత్రి వైపు నుంచి ఎలాంటి సౌండ్ లేదు. ఇంకా మిగిలిన సాంగ్స్, ట్రైలర్ కట్ గట్రా చాలా తతంగం పెండింగ్ లో ఉంది. విదేశాల నుంచి వచ్చాక కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తాల్సి ఉంటుంది. రిస్క్ కి రెడీ అయ్యే సెల్ఫ్ క్లాష్ కి సిద్ధపడ్డారు కానీ మైత్రికిదంతా పెద్ద సవాల్ గా మారుతోంది
డేట్ ఏదైనా సరే వాల్తేర్ వీరయ్య ముందు విడుదల తేదీ బయటికి ఇచ్చేస్తే ఓ పనైపోతుంది. ఊరికే నానబెట్టడం వల్ల లేనిపోని అనుమానాలు కలిగించడం తప్ప ఎలాంటి ప్రయోజనం కలగదు. ఇంకా క్యాస్టింగ్ తాలూకు డీటెయిల్స్ పూర్తిగా బయటికి చెప్పలేదు. విలన్ ఎవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మెగా ఫ్యాన్స్ మాత్రం ట్విట్టర్ వేదికగా అప్డేట్స్ కోసం మైత్రిని డిమాండ్ చేస్తున్నారు కానీ ఇంకా స్పందన రావడం లేదు. దేవిశ్రీ ప్రసాద్ మిగిలిన పాటలను ఎలా ఇచ్చి ఉంటాడన్న ఉత్సుకత మ్యూజిక్ లవర్స్ లో ఎక్కువగా ఉంది. ఇక వీరయ్య నిద్ర లేచి రన్నింగ్ చేయడమే బాకీ.