ప‌వ‌న్ నుంచి త్వ‌ర‌లో ఇంకో షాక్

2024 ఎన్నిక‌ల కోసం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాల్సిన స్థితిలో ఉన్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. సినిమాల‌కు మ‌హా అయితే ఇంకో రెండు మూడు నెల‌ల‌కు మించి స‌మ‌యం కేటాయించే ప‌రిస్థితి లేదు. ఈ లోపు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాన్ని పూర్తి చేయించాల‌ని దాని ద‌ర్శ‌క నిర్మాత‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు.

ఎన్నిక‌ల‌కు ముందు ఇంకో సినిమా మొద‌లుపెట్టి పూర్తి చేసే ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు. కానీ ప‌వ‌న్ అంద‌రికీ పెద్ద షాకిస్తూ సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను ఓకే చేశాడు. డీవీవీ ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఘ‌నంగా ప్ర‌క‌టించేసింది. కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో ఎవ్వ‌రికీ క్లారిటీ లేదు. కాంబినేష‌న్ ఎగ్జైట్ చేస్తున్న‌ప్ప‌టికీ ఈ సినిమా ఎప్పుడు కార్య‌రూపం దాలుస్తుందో అని మాట్లాడుకుంటున్నారు.

ఐతే ప‌వ‌న్ త్వ‌ర‌లోనే అభిమానుల‌కు ఇంకో పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రెండేళ్ల ముందే అనౌన్స్ చేసిన సినిమాకు ప్రారంభోత్స‌వం జ‌రుపుకోవ‌డానికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఇంకో వారం రోజులు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని మెగా ఫ్యామిలీ సినిమాల ప్రొడ‌క్ష‌న్, పీఆర్ వ్య‌వ‌హారాలు చూసే స‌తీష్ బొట్ట ట్విట్ట‌ర్లో ప్ర‌క‌టించ‌గా.. హ‌రీష్ శంక‌ర్ సైతం ఈ ట్వీట్‌పై స్పందించాడు. ఈ కాంబో క్రేజ్ గురించి ఇచ్చిన ఎలివేష‌న్‌కు థ్యాంక్స్ చెప్పాడు.

దీన్ని బ‌ట్టి చూస్తే వ‌చ్చే వారం ప‌వ‌న్‌-హ‌రీష్ మూవీకి ప్రారంభోత్స‌వం జ‌ర‌ప‌బోతుండ‌డం నిజ‌మే అనుకోవ‌చ్చు. ఐతే ఊరికే నామ‌మాత్రంగా ముహూర్త కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తే ప్ర‌యోజ‌నం ఏముంటుంది? సినిమా ముందుకు క‌దిలితేనే హ‌రీష్‌కైనా, మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌ల‌కైనా సంతోషం. కానీ అదైతే ఇప్పుడు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.