వీరసింహారెడ్డి చెప్పేశాడు – వీరయ్యే బాకీ

నువ్వా నేనా అని కవ్విస్తూ కనిపిస్తున్న సంక్రాంతి బరిలో మొదటి పందెంకోడి నుంచి కూత వచ్చేసింది. వీరసింహారెడ్డి విడుదల తేదీని జనవరి 12కి లాక్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది కొద్దిరోజుల క్రితమే లీకైనప్పటికీ చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటాయేమోనని అభిమానులు ఎదురు చూశారు. వాటికి చెక్ పెడుతూ రిలీజ్ డేట్ ని ఫైనల్ చేశారు. అంటే విజయ్ వారసుడుతో వీరసింహారెడ్డి నేరుగా తలపడబోతున్నాడు. స్క్రీన్ల పంపకాల రచ్చకు సంబంధించిన క్లారిటీ ఇంకా రాకపోయినా థియేటర్ల అగ్రిమెంట్లు నిర్మాతలు క్రమంగా చేసుకుంటున్నారు. కౌంట్ బయటికి రావాలి అంతే

2017 సంక్రాంతికి గౌతమి పుత్ర శాతకర్ణి వచ్చింది కూడా జనవరి 12కే. ఖైదీ నెంబర్ 150 నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా తట్టుకుని విజయం సాధించింది. కమర్షియల్ గా రెండూ సక్సెస్ కావడం అప్పటి ట్రేడ్ ని ఆనందంలో ముంచెత్తింది. ఇప్పుడు వాల్తేర్ వీరయ్య సంగతి తేలాల్సి ఉంది. 13న రావొచ్చనే టాక్ ఉంది కానీ ఈ అనౌన్స్ మెంట్ కూడా ఇంకో వారం రోజుల్లో రావొచ్చు. ముందు రవితేజ క్యారెక్టర్ ఇంట్రో టీజర్ ని వదిలాక ఆపై డేట్ ని కన్ఫర్మ్ చేయొచ్చని ఇన్ సైడ్ టాక్. అజిత్ తునివు సంగతి పెండింగ్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఉండకపోవచ్చని చెన్నై టాక్. ఇంకా హక్కులైతే అమ్మలేదని సమాచారం.

వీరసింహారెడ్డి డేట్ సిద్ధం చేసుకున్నాడు కాబట్టి ఇక ప్రమోషన్ల వేగం పెంచాల్సి ఉంటుంది. సరిగ్గా 40 రోజుల సమయం ఉంది. మిగిలిన పాటలు, ట్రైలర్, మీడియా ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ వగైరా చాలా హంగామా ఉంటుంది. ఇంకొంత చివరి భాగం షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి శృతి హాసన్ తో తీయాల్సిన డ్యూయెట్ బాలన్స్ ఉందనే మాట వినిపిస్తోంది కానీ దర్శక నిర్మాతలు నుంచి ఎలాంటి కామెంట్ లేదు. టైం దగ్గరపడుతున్న ఒత్తిడిలో షూట్ ని వేగంగా చేస్తున్నారు. నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ వచ్చేసింది కాబట్టి తర్వాతి వంతు వీరయ్యదే.