మొత్తానికి వచ్చే సంక్రాంతికి బెర్తులైతే కొంచెం ముందుగానే ఖరారైపోయాయి. ఆదిపురుష్ తప్పుకోగానే ఒక క్లారిటీ వచ్చేసింది. తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ చిత్రం వీరసింహారెడ్డి బెర్తులు ఖరారు చేసుకోగా.. తమిళం నుంచి వారసుడు చాలామందే కన్ఫమ్ అయింది.
ఆదిపురుష్ తప్పుకుంది కాబట్టి అజిత్ మూవీ తునివును కూడా లిమిటెడ్ రిలీజ్‌తో అయితే తెలుగులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మూడు చిత్రాలకు థియేటర్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే రిలీజ్ విషయంలో ఇబ్బంది రాకుండా డేట్లను కూడా సర్దుబాటు చేసుకోవడం కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఆయా నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూటర్లకు సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్లపై ఒక క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
సంక్రాంతికి ముందు రాబోయే సినిమా తునివునే. తమిళంలో ఈ చిత్రానికి జనవరి 11 డేట్ ఫిక్స్ చేశారు. తర్వాతి రోజు వారిసు రిలీజయ్యేలా అక్కడ ఒప్పందం జరిగింది. తెలుగులో కూడా వారసుడు అదే ప్రకారం రిలీజవుతుంది. ఇక్కడ చిరు, బాయల్య సినిమాలు ఒక్కో రోజు వచ్చేలా ప్లానింగ్ జరిగింది.
జనవరి 12న గురువారానికి వీరసింహారెడ్డిని ఖరారు చేయగా.. 13న శుక్రవారం వాల్తేరు వీరయ్యను రిలీజ్ చేయాలని ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫిక్సయింది. వీరసింహారెడ్డికి వారసుడుతో క్లాష్ అవుతున్నప్పటికీ అది డబ్బింగ్ సినిమా కాబట్టి పర్వాలేదనుకుంటున్నారు. దాదాపు ఈ లెక్కల ప్రకారమే సంక్రాంతి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్ల అందుబాటును బట్టి తెలుగులో ఇంకైదేనా మిడ్ రేంజ్ సినిమా శనివారం రిలీజయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. త్వరలోనే సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ పోస్టర్లు విడుదల కాబోతున్నాయి.