టిల్లు 2 హీరోయిన్ మళ్ళీ మారిందా

ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ డీజే టిల్లు 2కి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ముందు దర్శకుడు చేంజ్ అయ్యాడు. ఫస్ట్ పార్ట్ తీసిన విమల్ కృష్ణ స్థానంలో సీక్వెల్ కోసం మల్లిక్ రామ్ వచ్చాడు. హీరోయిన్ గా ముందు శ్రీలీల అనుకున్నారు. మంచి ఫామ్ లో ఉంది కాబట్టి గ్లామర్ పరంగా కూడా ఆకర్షణ అవుతుందనే ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా కనిపించింది. తర్వాత ఏమయ్యిందో అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది. ఇలాంటి ట్రెండీ మూవీస్ కి అంతగా ఫిట్ కాని ఈ కేరళ కుట్టిని ఇందులో ఎలా చూపిస్తారనే అనుమానం లేకపోలేదు. ఇప్పుడదే నిజమై తను కూడా బయటికి వచ్చేసిందని లేటెస్ట్ అప్ డేట్.

అనుపమ స్థానంలో మరో మల్లువుడ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ తీసుకున్నారని వినికిడి. ఇవేవి యూనిట్ అఫీషియల్ గా చెప్పడం లేదు. అన్నీ అంతర్గతంగా జరిగిపోతున్నాయి . కారణాలు ఏంటా అని ఆరా తీస్తే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ని తీర్చిదిద్దిన తీరు అనుపమకు నచ్చలేదట. ముందు నెరేషన్ లో చెప్పిన దానికి తర్వాత డెవలప్ చేసిన దానికి ఏవో వ్యత్యాసాలు వచ్చాయని వినికిడి. ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన డీజే టిల్లుకి ఇన్ని పరీక్షలు ఎదురు కావడం విచిత్రమే. నటించడంతో పాటు రచనకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్న సిద్దు జొన్నలగడ్డకు ఇదంతా సవాలే.

ఈ మడోనా అంటే ఎవరో అనుకునేరు. నాని శ్యామ్ సింగ్ రాయ్ లో లాయర్ పాత్ర చేసిన అమ్మాయి గుర్తుందా. తనే ఇప్పుడు సిద్ధూ జోడి. నాగచైతన్య ప్రేమమ్ లోనూ నటించింది కానీ ఎక్కువగా మలయాళం సినిమాలు చేయడం వల్ల మన ఆడియన్స్ కి అంతగా గుర్తు లేదు. ఇప్పుడీ టిల్లు 2 కనక బ్రేక్ ఇస్తే మళ్ళీ అవకాశాలు పెరుగుతాయి. వచ్చే ఏడాది వేసవిలోగా రిలీజ్ ని టార్గెట్ చేసుకున్న డీజే టిల్లు 2 ఇన్ని అవాంతరాలను దాటుకుని లక్ష్యాన్ని చేరుకుంటుందా చూడాలి. యూత్ లో మంచి క్రేజ్ ఉండటంతో బిజినెస్ పరంగా సితార సంస్థ ఈసారి డబుల్ మార్జిన్ ని ఆశిస్తోంది