అమేజాన్ న్యూ రిలీజ్.. ట్రైలర్ బాగుందే

ఇండియాలో ఓటీటీ విప్లవానికి తెర తీసిన సంస్థ.. అమేజాన్ ప్రైమ్. ఇక్కడ అత్యధిక సబ్ స్క్రిప్షన్లు కలిగిన సంస్థ కూడా అదే. వాళ్ల కోసం, కొత్తగా సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడం కోసం ఆ సంస్థ.. కొత్త సినిమాలు పెద్ద ఎత్తున కొని నేరుగా తమ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

పెన్‌మగల్ వందాల్, పెంగ్విన్, గులాబో సితాబో, సుజాతయుం సూఫియుం లాంటి సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ వరుసలో రానున్న కొత్త హిందీ చిత్రం ‘శకుంతలా దేవి’. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో అను మీనన్ రూపొందించిన చిత్రమిది. ఈ నెల 31 నుంచి ఈ చిత్రం అమేజాన్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ నేపథ్యంలో దీని ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఆసక్తికరంగా, ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.

గణిత శాస్త్రంలో అపార ప్రతిభ చూపించి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందిన శకుంతలా దేవి నిజ జీవిత కథ ఇది. ఐతే సినిమా కోసం కొంచెం డ్రామా జోడించినట్లున్నారు. చిన్నతనంలోనే గణితంలో గొప్ప ప్రతిభ చూపించి తన ఉపాధ్యాయుల్ని కూడా అబ్బురపరిచిన శకుంతల.. పెరిగి పెద్దయ్యాక మరెన్నో అద్భుతాలు చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో అనేక లెక్చర్లు ఇచ్చి విదేశీయుల్ని కూడా అబ్బురపరుస్తుంది.

కంప్యూటర్లను సైతం ఓడించే స్థాయిలో సూత్రీకరణలు చేస్తుంది. ఐతే పెళ్లి తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా కన్న కూతురితోనే సమస్య ఎదురవుతుంది. మరి తన ప్రొఫెషన్లో అద్భుతాలు చేసిన శకుంతల.. వ్యక్తిగత జీవితంలో సయస్యల్ని ఎలా పరిష్కరించిందన్నది మిగతా కథ. కథానాయిక గణిత ప్రతిభతో ముడిపడ్డ సన్నివేశాలు చాలా సరదాగా కనిపిస్తుండగా.. తల్లి-కూతురు మధ్య ఎపిసోడ్లు ఉద్వేగభరితంగా సాగేలా ఉన్నాయి.

అశ్వథ్థామ, భీష్మ చిత్రాల్లో నటించిన జిష్ణు సేన్ గుప్తా ఇందులో విద్యకు జోడీగా నటించడం విశేషం. కూతురి పాత్రలో సాన్యా మల్హోత్రా నటించింది. అమేజాన్ రిలీజ్ చేసిన కొత్త సినిమాలన్నీ నిరాశ పరిచిన నేపథ్యంలో.. శకుంతలా దేవి అయినా ప్రేక్షకుల మెప్పు పొందుతుందేమో చూడాలి.