తోడేలు టాక్ ఏంటి

ఇవాళ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సందడే ఉంది. స్టార్లు నటించినవి లేకపోయినా దేనికవే ప్రత్యేక అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా వీక్ గానే మొదలైనప్పటికీ కేవలం టాక్ ని నమ్ముకుని పోటీకి రెడీ అయ్యాయి. అందులో వరుణ్ ధావన్ తోడేలు ఒకటి. బాలీవుడ్ లో భేడియాగా రూపొందిన ఈ క్రియేచర్ కామెడీ థ్రిల్లర్ ని తెలుగులో అల్లు అరవింద్ అందించారు. ప్రమోషన్లు వగైరా బాగానే చేశారు కానీ వరుణ్ కిక్కడ పెద్ద ఇమేజ్ లేకపోవడంతో ఓపెనింగ్స్ డల్ గా ఉన్నాయి. ఆది పురుష్ లో ప్రభాస్ తో నటించిన కృతి సనన్ ఇందులో హీరోయిన్ కావడం మరో విశేషం.

అసలింతకీ సినిమా మ్యాటరేముందో చూద్దాం. కాంట్రాక్ట్ పనులు చేసే భాస్కర్(వరుణ్ ధావన్)కు ఓ అడవిలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ దక్కుతుంది. అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే ఆ ఫారెస్ట్ కు వెళ్లడం కష్టమైనా స్నేహితులను తీసుకుని చేరుకుంటాడు. అక్కడ వ్యతిరేకత ఎదురైనా పని సాగిస్తాడు. ఓ రాత్రి భాస్కర్ ని తోడేలు కరవడంతో అప్పటి నుంచి దానిలాగే మారిపోతూ రోజుకొకరిని చంపడం మొదలుపెడతాడు. చికిత్స కోసం డాక్టర్ అనిక(కృతి సనన్)సహాయం తీసుకుంటాడు. అసలు అతనికా భయంకరమైన వైరస్ ఎలా అంటుకుంది, ఎందుకు కొందరినే చంపడం లక్ష్యంగా పెట్టుకున్నాడనేదే తెరమీద చూడాలి.

ఇంటరెస్టింగ్ పాయింట్ ని తీసుకున్న దర్శకుడు అమర్ కౌశిక్ కి మంచి ప్రొడక్షన్ వేల్యూస్ దొరికాయి. దానికి తగ్గట్టే రిచ్ గా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ లో సరైన టెంపోతో నడిపించి ఇంటర్వెల్ బ్లాక్ కి హై ఇచ్చిన అమర్ రెండో సగంలో తడబడిపోయాడు. సీన్లు ఊహించినట్టే జరగడం, నెమ్మదిగా సాగడం ఇంప్రెషన్ ని తగ్గిస్తూ వెళ్ళింది. త్రీడిలో విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నప్పటికీ నెరేషన్ లోపాల వల్ల గొప్పగా నిలవాల్సిన ఎక్స్ పీరియన్స్ పర్లేదు దగ్గర ఆగిపోయింది. ఎమోషన్స్ సరిగా కనెక్ట్ చేయలేకపోయారు. ఓ విభిన్న ప్రయత్నంగా తోడేలు నిలిచింది కానీ బెస్ట్ అనిపించుకోలేదు.