దగ్గుబాటి హీరోకి రిలీజ్ టెన్షన్

మాములుగా ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోని పరిచయం చేస్తున్నప్పుడు దానికి సరైన కాంబోతో పాటు అనుకూలమైన రిలీజ్ టైమింగ్ కుదరాలి. అప్పుడే జనానికి కరెక్ట్ గా రిజిస్టర్ అవుతాడు. సినిమా బాగుందా మొదటి మెట్టు విజయవంతం. పోయిందా కనీసం ఒకడు వచ్చాడనే విషయం గుర్తుంటుంది.

దగ్గుబాటి అభిరాంని లాంచ్ చేస్తూ తేజ దర్శకత్వంలో రూపొందిస్తున అహింస ఎప్పుడు రిలీజ్ చేయాలో అంతుచిక్కని గందరగోళంలో సురేష్ బాబు టీమ్ ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. ఆల్రెడీ రిలీజైన టీజర్, లిరికల్ వీడియోలు లేని బజ్ ని పెంచకపోయినా సోషల్ మీడియాలో అహింసను ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాయి.

అక్టోబర్ అన్నారు కానీ జరగలేదు. ఇప్పుడు నవంబర్ అయిపోతోంది. డిసెంబర్ 23కి లాక్ చేయాలని చూస్తున్నట్టుగా వస్తున్న వార్త కొత్త డౌట్లను రేకెత్తిస్తోంది. ఎందుకంటే అదే రోజు రవితేజ ధమాకా ఉంది. నిఖిల్ 18 పేజెస్ వస్తోంది.

ఒక రోజు ముందు విశాల్ లాఠీని దింపుతున్నారు. ఇక్కడితో అయిపోలేదు రణ్వీర్ సింగ్ సర్కస్, కన్నడ మూవీ వేదా ఈ రెండు కూడా ప్యాన్ ఇండియా రిలీజ్ అందుకోబోతున్నాయి. వీటి మధ్య అహింసకు థియేటర్లు దొరకడం సరే మధ్యలో నలిగిపోవడం ఖాయం. నువ్వు నేను రేంజ్ లో టాక్ వస్తే తప్ప అహింసకు టికెట్లు తెంచలేరు.

పోనీ వారం ముందు వద్దామంటే అవతార్ 2 బ్యాక్ టు వాటర్ ఊపులో కొట్టుకుపోవడం తప్పదు. డిసెంబర్ 9న చాలా సినిమాలున్నాయి. విఆర్ఎల్ ట్రాన్స్ పోర్ట్ అధినేత బయోపిక్ విజయానంద్ ని గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు.

ఇది మినహాయిస్తే మిగిలినవన్నీ చిన్న చిత్రాలే. దీన్ని ఎంచుకున్నా మంచి నిర్ణయమే అవుతుంది కానీ ప్రమోషన్లకు టైం లేదనుకుంటున్నారో ఏమో. ఇప్పుడు మిస్ చేస్తే తిరిగి జనవరిలో సాధ్యం కాదు కాబట్టి ఫిబ్రవరికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. అసలు ప్లానింగ్ విషయంలో తిరుగు ఉండని సురేష్ బాబు అహింసకు మాత్రం ఇంత హింసను ఎలా భరిస్తున్నారో .