నాగార్జున అల్లరోడి కాంబోలో రీమేక్ ?

ఇంగ్లీష్ టైటిల్స్ తో యాక్షన్ సబ్జెక్టులతో వరసగా ఫ్లాపులు అందుకుంటున్న అక్కినేని నాగార్జున ఎట్టకేలకు రూటు మార్చుకోబోతున్నట్టు కనిపిస్తోంది. స్ట్రెయిట్ కథలతో దర్శకులు తనను ఫ్యాన్స్ కోరుకున్న రీతిలో చూపించలేకపోవడం మార్కెట్ మీద ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుందో పక్కా బిజినెస్ మెన్ అయిన నాగ్ కు తెలియంది కాదు. అందుకే ఓ రెండు నెలలు బ్రేక్ తీసుకుని 2023లో ఫ్రెష్ గా కొత్త సినిమాలు ప్లాన్ చేసుకోబోతున్నారు. అందులో భాగంగానే రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ ని డైరెక్టర్ గా చేసే డెబ్యూ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ ఆల్రెడీ పాకిపోయింది.

దీనికి సంబంధించి మరొకొన్ని ఆసక్తికరమైన విశేషాలున్నాయి. ఇది 2019లో వచ్చిన మళయాలం సూపర్ హిట్ పోరింజు మరియం జోస్ కు రీమేక్ గా రూపొందుతుందని వినికిడి. అధికారికంగా హక్కులు కూడా కొనేశారని ఇన్ సైడ్ న్యూస్. ఇది ముగ్గురు స్నేహితుల మధ్య సాగే యాక్షన్ కం ఎమోషనల్ థ్రిల్లర్. వీరిలో ఒక పాత్ర హీరోయిన్. మెయిన్ లీడ్ నాగార్జున కాగా మరో బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో అల్లరి నరేష్ ని నటింపజేయాలని చూస్తున్నట్టుగా తెలిసింది. ఒరిజినల్ వెర్షన్ లో ఇవి జోజు జార్జ్, చెంబన్ వినోద్ జోస్ పోషించారు. కథ 1965లో మొదలై 1985కు వస్తుంది. అంటే ఒకరకంగా చెప్పాలంటే రంగస్థలం టైపు పీరియాడిక్ డ్రామా.

ఇవి అధికారికంగా చెప్పకపోయినా ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలైతే జోరుగా సాగుతున్నాయి. ఈ పోరింజు మరియం జోస్ కేవలం ఆరు కోట్ల బడ్జెట్ తో రూపొంది ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది. కాకపోతే అక్కడ చేసింది స్టార్ హీరోలు కాదు. ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు. మరి దాన్ని తెలుగు యధాతథంగా తీస్తే వర్కౌట్ కాదు. నాగార్జున అల్లరి నరేష్ ఫాలోయింగ్, వయసు రెండింటిని దృష్టిలో పెట్టుకుని సెట్ చేయాల్సి ఉంటుంది. ప్రసన్న కుమార్ కిది పెద్ద ఛాలెంజే. అఫీషియల్ నోట్ వచ్చేదాకా ఏదీ ఖరారుగా చెప్పలేం కానీ జనవరికంతా క్లారిటీ వచ్చేస్తుంది.