ఈ సినిమాకు త్రీడీ ఏంటయ్యా?

ఇండియాలో త్రీడీ సినిమాలు ఇప్పటిదాకా పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. హాలీవుడ్ భారీ చిత్రాల స్థాయిలో త్రీడీని సరిగ్గా ఉపయోగించుకుని ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన వాళ్లు తక్కువే. సినిమాల క్వాలిటీ పక్కన పెడితే.. అసలు త్రీడీ సినిమాలను ప్రదర్శించడానికి అనువైన థియేటర్ల సంఖ్య కూడా ఇండియాలో చాలా తక్కువ. త్రీడీ సినిమాలు వర్కవుట్ కాకపోవడానికి అది కూడా ఒక కారణం. అసలు త్రీడీలో సినిమా తీయాలంటే అందుకు జానర్ కూడా చాలా ముఖ్యం. చారిత్రక నేపథ్యం, విజువల్ ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ముడిపడ్డ చిత్రాలను త్రీడీలో చూస్తే ఎంతో కొంత కిక్కు ఉంటుంది.

అలా కాకుండా మామూలు చిత్రాలను త్రీడీలో చూడడంలో ప్రత్యేకమైన అనుభూతి ఏమీ కలగదు. గతంలో నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఓం’ అనే యాక్షన్ మూవీని త్రీడీలో చేసి ఎంత పెద్ద ఎదురు దెబ్బ తిన్నాడో తెలిసిందే. ఊరికే ఖర్చు, ప్రయాస తప్పితే ఆ సినిమాకు త్రీడీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అల్లరి నరేష్ కామెడీ మూవీ ‘యాక్షన్’ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. టాలీవుడ్లో ఇలాంటి అనుభవాలుండగా.. ఇప్పుడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా ఇలాంటి తప్పే చేస్తున్నాడని అనిపిస్తోంది.

తమిళ బ్లాక్‌బస్టర్ ‘ఖైదీ’ని హిందీలో అజయ్ ‘భూలా’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత కూడా అజయే కావడం విశేషం. తాజాగా రిలీజైన ‘భూలా’ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ‘దృశ్యం-2’ సూపర్ హిట్ టాక్‌, వసూళ్లతో దూసుకెళ్తున్న టైంలో ఈ టీజర్ రావడం ప్లస్ అయింది. టీజర్ అంతా బాగానే ఉంది కానీ.. ఇలాంటి మామూలు యాక్షన్ డ్రామా మూవీని త్రీడీలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడమే జనాలకు మింగుడుపడడం లేదు. ఇదేమీ విజువల్ మాయాజాలంతో, ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ సినిమా కాదు. ఇలాంటి సగటు యాక్షన్ డ్రామాకు త్రీడీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలను త్రీడీలో చూడాలన్న ఆసక్తి కూడా ఉండదు. మరి అజయ్ అండ్ టీం ఎందుకంత కష్టపడుతోందో?