ఇంకో పాతిక రోజుల్లో విడుదల కాబోతున్న అవతార్ 2 ఫీవర్ మెల్లగా పెరుగుతోంది. ఇండియాలో అంత బజ్ లేదనుకుంటున్న టైంలో ఇవాళ రిలీజ్ చేసిన కొత్త ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలకు ఎక్కడికో తీసుకెళ్లింది. ఖచ్చితంగా మొదటి రోజే చూడాలనే ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ని మరింతగా పెంచేసింది. డిసెంబర్ 15 అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు మొదలుకాబోతున్నాయి. దీనికి సంబంధించి ఆన్ లైన్ టికెట్ అమ్మకాలు మొదలు పెట్టేశారు. ప్రపంచంలో అందరికంటే ముందే చూడాలంటే మాత్రం మిడ్ నైట్ షోకు వెళ్లాల్సిందే. అవతార్ 2 రకరకాల ఫార్మట్లో రాబోతోంది.
సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇంత విజువల్ గ్రాండియర్ కు సంబంధించి టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటాయానే అనుమానం రావడం సహజం. కానీ తెలుగు ఆడియన్స్ టెన్షన్ పడనక్కర్లేదు. ఎందుకంటే దేశం మొత్తం మీద అవతార్ 2ని చవకగా చూసే ఛాన్స్ మనకే దక్కనుంది. మీరే చూడండి. బెంగళూర్ లో ఐమాక్స్ త్రీడిలో చూడాలంటే టికెట్ రేట్ 1450 రూపాయలు, పూణేలో 1200, ఢిల్లీలో 1000, అహ్మదాబాద్ లో 750, ఇండోర్ లో 700, ముంబైలో 970 చెల్లించాలి. అదే హైదరాబాద్ లో ఫోర్డి ఎక్స్ తో కలిపి జస్ట్ 350 రూపాయలు పెడితే చాలు. వద్దు సాధారణ త్రీడి చాలనుకుంటే మూడు వందల లోపే అయిపోతుంది.
ఆంధ్రాలోనూ ఇలాంటి ధరలే ఉండబోతున్నాయి. వైజాగ్ త్రీడి 210 రూపాయల దాకా ఉండగా జిల్లా కేంద్రాల్లో 177 ఖర్చు పెట్టుకుంటే చాలు. ఇవన్నీ మల్టీప్లెక్స్ ప్రీమియమ్ రేట్లు. ఏదైనా సింగల్ స్క్రీన్ లో చూస్తామంటే ఖర్చు ఇంకా తగ్గిపోతుంది. ఈ లెక్కన ప్రధాన నగరాలు పట్టణాలతో ఎలా పోల్చి చూసుకున్నా ఏపీ తెలంగాణలో అవతార్ అభిమానులే లక్కీ అని చెప్పొచ్చు. డిస్ట్రిబ్యూషన్ పద్ధతి మీద కాకుండా నిర్మాణ సంస్థ ఈ మూవీని స్వంతంగా రిలీజ్ చేస్తోంది. ఇండియా వైడ్ సుమారు ఏడు వందల నుంచి వెయ్యి కోట్ల దాకా గ్రాస్ ని ఎక్స్ పెక్ట్ చేస్తోంది. టాక్ పాజిటివ్ వస్తే ఇదేమంత కష్టం కాదు.