దుమ్ముదులుపుతున్న దృశ్యం-2

కొవిడ్ త‌ర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ ఎలా ఢీలా ప‌డిందో తెలిసిందే. గ‌త ఏడాది కాలంలో అర‌డ‌జ‌ను సినిమాలు కూడా థియేట‌ర్ల‌లో బాగా ఆడి లాభాలు తెచ్చిపెట్ట‌లేదు. పెద్ద హీరోలు న‌టించిన భారీ చిత్రాలు కూడా బోల్తా కొడుతుండ‌డంతో బాలీవుడ్ బెంబేలెత్తిపోతోంది. ఆమిర్ ఖాన్, హృతిక్ రోష‌న్, అక్ష‌య్ కుమార్ లాంటి బ‌డా స్టార్ల‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోర ప‌రాభ‌వాలు త‌ప్ప‌లేదు. రోజు రోజుకూ ప‌రిస్థితి ఘోరంగా త‌యార‌వుతుండ‌డంతో బాలీవుడ్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. ఇలాంటి టైంలో ఒక సినిమా బాలీవుడ్‌లో కొత్త ఆశ‌లు రేపుతోంది. ఆ చిత్ర‌మే.. దృశ్యం-2.

మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ దృశ్యంను హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టిన అజ‌య్ దేవ‌గ‌ణ్‌.. దాని సీక్వెల్‌ను సైతం రీమేక్ చేశాడు. అభిషేక్ పాఠ‌క్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మ‌ల‌యాళ వెర్ష‌న్‌తో పోలిస్తే కొన్ని మార్పులు చేర్పులు చేసి మ‌రింత ఎగ్జైటింగ్‌గా సినిమాను తీర్చిదిద్దారు.

ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగ‌డం, దృశ్యం సీక్వెల్ ప‌ట్ల ఉన్న ఆస‌క్తి సినిమాకు ప్ల‌స్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే మంచి ఊపు చూపించిన దృశ్యం-2.. తొలి రోజు రూ.15 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్ల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర శుభారంభం చేసింది. రివ్యూల‌కు తోడు మౌత్ టాక్ కూడా బాగుండ‌డంతో హిందీ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎగ‌బ‌డుతున్నారు. శ‌నివారం వ‌సూళ్లు మ‌రింత‌గా పుంజుకున్నాయి. రూ.25 కోట్ల దాకా గ్రాస్ వ‌చ్చిందీ చిత్రానికి. శ‌నివారం ప్యాక్డ్ హౌసెస్‌తో న‌డిచింది దృశ్యం-2.

డిమాండ్ ఎక్కువ ఉండ‌డంతో షోలు, స్క్రీన్లు పెంచుతూ పోతున్నారు సినిమాకు. ఆదివారం టికెట్లు దొర‌క‌డం క‌ష్ట‌మ‌య్యే ప‌రిస్థితి అంటే సినిమా ఎంత బాగా ఆడుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. వీకెండ్లో సినిమా రూ.60 కోట్ల దాకా గ్రాస్ క‌లెక్ట్ చేసేలా ఉంది. సినిమాకు లాంగ్ ర‌న్ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి దృశ్యం-2 బాలీవుడ్‌కు గొప్ప ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తోంద‌న‌డంలో సందేహం లేదు.