థియేటర్లు షేక్ అవుతాయి-దిల్ రాజు

తమిళనాట ప్రస్తుతం సంచలనం రేపుతున్న సినిమా ‘లవ్ టుడే’. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. ఈ నెల 25నే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాకు కొంచెం పెద్ద స్థాయిలోనే ప్రమోషనల్ ఈవెంట్ చేశారు.

తమిళంలో ఈ సినిమాలో భాగమైన కాస్ట్ అండ్ క్రూ మొత్తం హైదరాబాద్‌కు వచ్చింది. వారి సమక్షంలో ఈ సినిమాకు ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చాడు దిల్ రాజు. ఆల్రెడీ ఈ సినిమా తమిళంలో థియేటర్లను షేక్ చేస్తుందని.. ఈ నెల 25న సినిమా తెలుగులో రిలీజయ్యాక తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు షేక్ అయిపోతాయని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమాను ముందు రీమేక్ చేయాలని అనుకున్న తాను.. తర్వాత ఎందుకు మనసు మార్చుకుని డబ్బింగ్ వెర్షనే రిలీజ్ చేస్తున్నానో కూడా రాజు ఈ కార్యక్రమంలో వెల్లడించారు.

‘‘ఈ మధ్య కాంతార అనే సినిమా భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఇండియా మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తమిళంలో ‘లవ్ టుడే’ కూడా అలాగే హాట్ టాపిక్ అయింది. తమిళనాడులో ఈ చిన్న సినిమా ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తమిళనాడు అనే కాకుండా తమిళ వెర్షన్ రిలీజైన కర్ణాటకలో, ఓవర్సీస్‌లో.. ఇలా అన్ని చోట్లా అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. ఎ, బి, సి అని తేడా లేకుండా అన్ని సెంటర్లలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను నేను తెలుగులో రిలీజ్ చేయడం వెనుక ఒక కథ ఉంది. నేను ‘వారిసు’ సినిమాను తమిళంలో చేస్తుండగా.. తమిళ నిర్మాత మహాలింగం మేకింగ్ దశలో ఉన్న ‘లవ్ టుడే’ సినిమా గురించి చెప్పి దాన్ని రీమేక్ చేస్తే బాగుంటందని అన్నారు. ఐతే ముందు తమిళంలో సినిమా రిలీజవ్వనీ అని చెప్పాను. విజయ్ గారి ఇంట్లో హోం థియేటర్లో మేమంతా కలిసి ట్రైలర్ చూసినపుడు భలేగా అనిపించింది. ఆ తర్వాత సినిమా రిలీజయ్యాక చెన్నై సత్యం థియేటర్లో జనాల మధ్య సినిమా చూశాను. థియేటర్ షేక్ షేక్ అయిపోయింది. జనాలు సీట్లలో కూర్చోవట్లేదు. ఎగిరి ఎగిరి పడి నవ్వుతున్నారు. ఐతే అప్పుడు సినిమా చూశాక దీన్ని రీమేక్ చేయడం కరెక్ట్ కాదేమో అని కన్ఫ్యూజన్లో పడ్డాను. తర్వాత హైదరాబాద్‌లో తెలిసిన వాళ్లకు ఈ సినిమా షోలు వేసి చూపించాను. వాళ్లు రీమేక్ చేస్తే బాగా డబ్బులొస్తాయి అన్నారు. కానీ నాకు మాత్రం ఈ సినిమాను రీమేక్ చేస్తే మ్యాజిక్ రిపీట్ కాదు అనిపించింది. ఎక్కడైనా ఏదైనా సినిమా బాగుందంటే యూత్ ముందే చూసేస్తున్నారు. వాళ్లు రీమేక్ చేసే వరకు ఆగలేరు. అందుకే దీన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో కామెడీతో పాటు ఒక హార్ట్ టచింగ్ ఎమోషన్ కూడా ఉంది. సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ సినిమాతో కనెక్టవుతారు. ఈ నెల 25న సినిమా రిలీజవుతుంది. తర్వాతి రోజు నుంచి థియేటర్లు షేక్ అయిపోతాయి’’ అని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశాడు.