మసూదా …. భయపెట్టిందా

కొత్త శుక్రవారానికి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం రెగ్యులర్ ఆడియన్స్ కి నిరాశ కలిగించింది. గాలోడుకి మాస్ సెంటర్స్ లో  మార్నింగ్ షోలకు మంచి స్పందన వచ్చింది కానీ టాక్ అయితే ఏమంత ఆశాజనకంగా లేదు. ఉన్న వాటిలో ఒక్క మసూదకు మాత్రమే డీసెంట్ బజ్ ఉంది. ఆకట్టుకునే క్యాస్టింగ్ లేకపోయినా కేవలం కంటెంట్ మీద ఆధారపడి ఆసక్తి రేపే ట్రైలర్ తో పబ్లిసిటీ బాగానే చేసుకున్నారు. పంపిణి బాధ్యతను దిల్ రాజు తీసుకున్నాక తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి రిలీజ్ దక్కింది. లిమిటెడ్ ఆడియన్స్ టార్గెట్ తో వచ్చిన దీనికీ ఓపెనింగ్స్ సోసోనే.

ఇక సినిమా విషయానికి వస్తే స్కూల్లో చదువుకునే నజియా(బంధవి శ్రీధర్)కు దెయ్యం ఆవహిస్తుంది. టీచర్ గా పని చేసే తల్లి నీలం(సంగీత) భయపడిపోయి పక్క ఫ్లాట్ లో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గోపి(తిరువీర్)సహాయం కోరుతుంది. ఇద్దరూ కలిసి నజియాను పట్టుకుంది ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం చనిపోయిన మసూదగా కనుక్కుంటారు. ఫకీర్లు బాబాల సహాయంతో ఆ రహస్యాన్ని ఛేదించి ప్రాణాలకు తెగించి నజియాను కాపాడటమే అసలు కథ. యాక్టింగ్ పరంగా తారాగణం బాగానే కుదిరింది. అందరూ ఆయా పాత్రలకు సరిపోయారు. సంగీత, తిరువీర్ లే ఎక్కువ హైలైట్ అయ్యారు.

టెక్నికల్ గా మసూదలో మంచి కంటెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో అవసరానికి మించిన లవ్ స్టోరీని సాగదీయడం, సెకండ్ హాఫ్ లో చాలా గ్రిప్పింగ్ గా ఊహాకతీతంగా జరగాల్సిన కథనం కొంత కుదుపులకు లోనవ్వడంతో ఓవరాల్ గా పర్లేదనే ఫీలింగ్ తప్ప ఆశించినంత ఎక్స్ ట్రాడినరిగా దర్శకుడు సాయికిరణ్ మసూదను మలచలేకపోయాడు. ఫిమేల్ లీడ్ కి దెయ్యం పట్టడమనేది ఎప్పుడో తులసిదళం నుంచి వర్మ భూత్ దాకా ఎన్నోసార్లు వచ్చిందే. కాకపోతే ముస్లిం బ్యాక్ డ్రాప్ కొత్తగా అనిపించడం మసూదకు ప్లస్ అయ్యింది. ఎక్కువ ఆశించకుండా చూస్తేనే మసూద ఓ మోస్తరుగా భయపెడుతుంది