కుర్ర హీరోకి హిట్టు పడిందా

వరస ఫ్లాపులతో సతమతమయ్యే హీరోలకు ఆర్టిస్టులకు ఇప్పుడు ఓటిటి మంచి వేదికగా మారింది. బడ్జెట్ లోనూ మేకింగ్ లోనూ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని క్వాలిటీతో నిర్మాణాలు చేస్తుండటంతో వెబ్ సిరీస్ లకు మెల్లగా ఆదరణ పెరుగుతోంది. వీటికి ప్రమోషన్లు సైతం అదే రేంజ్ లో ప్లాన్ చేసుకోవడం రేంజ్ ని పెంచుతోంది. తాజాగా కుర్ర హీరో రాజ్ తరుణ్ అదే బాట పట్టాడు. కుమారి 21 ఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని క్రమంగా డిజాస్టర్ల రూపంలో మార్కెట్ తగ్గించుకుంటూ పోయాడు. ఆ మధ్య వచ్చిన అనుభవించు రాజా, స్టాండ్ అప్ రాహల్ కు కనీస ఓపెనింగ్స్ దక్కలేదు.

అందుకే అహ నా పెళ్ళంటతో వెబ్ సిరీస్ కు షిఫ్ట్ అయ్యాడు. అల్లు శిరీష్ తో ఏబిసిడి తీసిన దర్శకుడు సంజీవ్ రెడ్డి తిరిగి అదే టీమ్ తో ఈ రామ్ కామ్ ఎంటర్ టైనర్ ని రూపొందించారు. అలనాటి జంధ్యాల గారి క్లాసిక్ టైటిల్ ని వాడుకోవడంతో పాటు ట్రైలర్ వల్ల జనంలో అంతో ఇంతో దీని మీద ఆసక్తి నెలకొంది. నిన్నటి నుంచే జీ5లో స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. అమ్మాయిలంటే కిట్టని ఓ కుర్రాడు ఇంట్లో అమ్మానాన్నా చూసిన సంబంధాన్నే చేసుకోవాలనుకునే సాంప్రదాయ ఆలోచనలతో ఉంటాడు. ఈ క్రమంలో పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుంది. దానికి కారణమైన అమ్మాయితోనే అతని జీవితం కొత్త మలుపు తీసుకుంటుంది.

లైన్ మరీ కొత్తది కాకపోయినా వినోదం ఇవ్వడమే టార్గెట్ గా పెట్టుకుని తీసిన అహ నా పెళ్ళంట టైం పాస్ బాగానే చేయించింది. మొదటి రెండు మూడు ఎపిసోడ్లు కొంత సాగతీత అనిపించినా ఆ తర్వాత బండి పట్టాలు ఎక్కడంతో కాలక్షేపానికి లోటు లేకుండా పోయింది. రాజ్ తరుణ్, హీరోయిన్ శివాని రాజశేఖర్ లతో పాటు మంచి క్యాస్టింగ్ దీనికి బలంగా నిలిచింది. కళ్యాణ్ రాఘవ్ సంభాషణలు, శాండీ సంగీతం ప్లస్ అయ్యాయి. ఇదే కథని సినిమాగా అయితే ఈ స్థాయిలో మెప్పించడం ఇబ్బందయ్యేది కానీ ల్యాగ్ అనిపించినప్పుడు ఫార్వార్డ్ బటన్ కి పని చెప్పే ఓటిటి ఓ ట్రయిల్ అయితే నిక్షేపంగా వేయొచ్చు. కుర్రాడికి డిజిటల్ బోణీ అయినట్టే.