టాలీవుడ్లో స్టార్ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్స్ చూశాక ఎందుకింత దిగజారి ప్రవర్తిస్తుంటారు అనిపిస్తుంటుంది. ఐతే ఈ జాఢ్యం అంతా తమిళ అభిమానుల నుంచి వచ్చిందే. సోషల్ మీడియాలో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి అవతలి హీరోను కించపరచడం.. దారుణాతి దారుణమైన కామెంట్లు, మీమ్స్ చేయడం మొదలైంది తమిళంలోనే. అక్కడ టాప్ హీరోలైన విజయ్, అజిత్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
ఒకప్పుడు ఆఫ్ లైన్ ఫ్యాన్ వార్స్ ఒక స్థాయి వరకే ఉండేవి. కానీ సోషల్ మీడియా వచ్చాక అవతలి హీరోను కించపరుస్తూ ట్వీట్లు వేయడం.. హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేయడం లాంటి దిగజారుడు పనులు మొదలుపెట్టారు. వాళ్లు పెట్టిన కొన్ని హ్యాష్ ట్యాగ్స్ చూస్తే ఫ్యాన్ వార్స్ ఈ స్థాయిలో జరుగుతాయా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ట్రెండ్‌ను మనవాళ్లు కూడా అనుకరిస్తుండడం గమనించవచ్చు.
ఐతే వేరే ఇండస్ట్రీల ఫ్యాన్స్ తమను అందుకునే ప్రయత్నం చేసిన ప్రతిసారీ.. దిగజారుడుతనంలో ఇంకో అడుగు కిందికి వెళ్లిపోతుంటారు తమిళ అభిమానులు. మామూలుగానే విజయ్, అజిత్ అభిమానుల ఫ్యాన్ వార్స్ ఇంక రేంజిలో ఉంటాయంటే వచ్చే సంక్రాంతికి ఆ ఇద్దరు హీరోల సినిమాలు వారిసు (తెలుగులో వారసుడు), తునివు ఒకేసారి బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతుండడంతో అభిమానుల గొడవలు ఇంకో స్థాయికి చేరుకున్నాయి. సంక్రాంతికి విజయ్ సినిమాదే హవా అని అతడి అభిమానులు అంటుంటే.. తమ హీరోదే పైచేయి అని అజిత్ ఫ్యాన్స్ అంటున్నారు.
అంత వరకు ఆగితే ఓకే.. అవతలి హీరోను, అతడి సినిమాను దారుణంగా కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇంకా విడుదలకు రెండు నెలలు ఉండగానే ఫ్యాన్ వార్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక రిలీజ్ టైంకి ఈ గొడవలు ఏ స్థాయికి చేరుకుంటాయో అన్న భయాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ స్పందించి.. ఫ్యాన్ వార్స్ గురించి నేరుగా ప్రస్తావించకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం బతుకుదాం, వేరేవాళ్లను బతికిద్దాం.. డ్రామా వద్దు, నెగెటివిటీ వద్దు.. మీ చుట్టూ ప్రోత్సహించే వారినే పెట్టుకోండి. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి దిశగా ప్రేరణ పొందండి. అసూయ వద్దు.. ద్వేషం వద్దు’’ అంటూ సందేశం ఇచ్చాడు అజిత్. ఎక్కడా సినిమాలు, ఫ్యాన్ వార్స్ గురించి ప్రస్తావన లేకపోయినా.. సోషల్ మీడియాలో జరుగుతున్న గొడవల నేపథ్యంలోనే అజిత్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడన్నది స్పష్టం.