బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. పాత పోస్టుల రచ్చ

లవ్ టుడే.. ఇప్పుడు తమిళనాడును ఊపేస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఇదొక వెరైటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా. ప్రేమించుకుని, పెళ్లికి సిద్ధపడ్డ ఒక జంటకు.. అమ్మాయి తండ్రి ఒక కండిషన్ పెడతాడు. మీ ఇద్దరి ఫోన్లను ఒక్క రోజు పాటు ఎక్స్‌ఛేంజ్ చేసుకోండి, ఆ తర్వాత కూడా మీకు ఓకే అంటే మీ పెళ్లి చేస్తా అంటాడు. ఆ కండిషన్‌కు ఒప్పుకుని మొబైల్స్ మార్చుకున్న జంట పడే ఇబ్బందుల నేపథ్యంలో తెరకెక్కిందీ సినిమా.

ఇంతకుముందు జయం రవి హీరోగా ‘కోమాలి’ అనే సినిమా తీసిన ప్రదీప్ రంగనాథన్.. తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తీశాడు. యూత్‌కు విపరీతంగా నచ్చేసిన ఈ చిత్రం తమిళనాట సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. తెలుగులో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు. త్వరలోనే సినిమా విడుదల కాబోతోంది. ఐతే ఈ సినిమా ఇలా యూత్‌ను ఊపేస్తున్న టైంలో ప్రదీప్ వివాదంలో చిక్కుకున్నాడు.

దర్శకుడు కావడానికి ముందు, ఒక మామూలు కుర్రాడిలా ఉండగా ఫేస్ బుక్, ట్విట్టర్లో ప్రదీప్ పెట్టిన పోస్టులను తవ్వి తీసి.. వాటి స్క్రీన్ షాట్లతో అతణ్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అతను ప్రధానంగా సచిన్, ధోనీ లాంటి లెజెండరీ క్రికెటర్లను తిడుతూ పెట్టిన పోస్టులే చర్చనీయాంశంగా మారాయి. సచిన్ ఇండియన్ క్రికెట్లోనే అత్యంత స్వార్థపరుడైన ఆటగాడని.. ధోని బంతులను విపరీతంగా వృథా చేస్తాడని, జిడ్డు బ్యాటింగ్‌తో సతాయిస్తాడని అతను పాత పోస్టుల్లో కౌంటర్లు వేశాడు. దీంతో పాటుగా తన షార్ట్ పిలిం చూసి తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ తమిళ ఇండస్ట్రీ ప్రముఖులను వేడుకుంటూ అతను పెట్టిన పోస్టులు సైతం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీటి విషయంలో పాజిటివ్‌గా స్పందిస్తున్న నెటిజన్లు సచిన్, ధోనీలను తిట్టిన పోస్టుల విషయంలో మాత్రం మండిపడుతున్నారు.

ఐతే ప్రదీప్ ఈ విషయమై స్పందించాడు. తన పాత పోస్టులు కొన్నింటిని మార్ఫ్ చేసి ట్రోల్ చేస్తున్నారని, అందుకే ఫేస్ బుక్ అకౌంట్ డీయాక్టివేట్ చేస్తున్నానని ప్రకటించాడు. వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు నిజమైనవే అని, ఐతే సరైన మెచ్యూరీటి లేనపుడు అలా పోస్టులు పెట్టానని, ఎవరైనా సరే వయసుతో పాటు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతారని, తాను కూడా అందుకు మినహాయింపు కాదని అతను క్లారిటీ ఇచ్చాడు.