తోడేలు సినిమాను ఫ్రీగా చూడొచ్చట

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు నిర్మాతలు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఏ సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నారో దేని మీద బజ్ లేదో ముందుగా అంచనా వేయడం తలలు పండిన విశ్లేషకుల వల్ల కూడా కావడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ సిచువేషన్ మరీ అన్యాయంగా ఉంది. 2022లో కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ ఈ రెండు డబ్బింగ్ చిత్రాలే టాప్ టూలో ఉండటాన్ని బట్టే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతగొప్పగా చాటింపు వేసుకున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సైతం అయిదు వందల కోట్ల మార్కుని టచ్ చేయలేక చేతులెత్తేసింది. దీనికే ఇలా ఉంటే ఇక మీడియం రేంజ్ హీరోల పరిస్థితి వేరే చెప్పాలా.

ఈ నెల 25 వరుణ్ ధావన్ భేడియా రిలీజ్ అవుతోంది. తెలుగులో తోడేలు పేరుతో నిర్మాత అల్లు అరవింద్ అందిస్తున్నారు. ట్రైలర్ వచ్చాక అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. కాకపోతే జనంలో హైప్ లేదు. ఓపెనింగ్స్ విషయంలో ప్రొడ్యూసర్లు టెన్షన్ గా ఉన్నారు. దీంతో కొత్త ఆఫర్లతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా బుక్ మై షోతో టైఅప్ చేసుకున్నారు. దాని ప్రకారం 175 రూపాయలు పెట్టి ఒక ఓచర్ కొంటే భేడియా టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు 350 రూపాయలు మనకు వెనక్కు వస్తుంది. అంటే ఉచితంగా చూసే ఛాన్సన్న మాట. కాకపోతే 20వ తేదీ లోపే కొనేయాలి.

దీన్ని బట్టి వసూళ్ల కోసం ఎన్ని రకాల ఎత్తుగడలు వేయాల్సి వస్తోందో అర్థం చేసుకోవచ్చు. భేడియా హారర్ కం కామెడీ థ్రిల్లర్. ఒక మనిషి తనకు తెలియకుండా వివిధ సమయాల్లో హఠాత్తుగా తోడేలుగా మారిపోయే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఎప్పుడో 1992లో జునూన్ అనే మూవీ వచ్చింది. అందులో హీరో రాహుల్ రాయ్ ప్రతి అమావాస్యకు పులిగా మారిపోయి మనుషులను చంపుతూ ఉంటాడు. ఇక్కడ దాన్ని తోడేలుగా మర్చి ఎంటర్ టైన్మెంట్ టచ్ ఇచ్చారు. ఆది పురుష్ ఫేమ్ కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ టైపు బంపర్ ఆఫర్లు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి.