చాలారోజుల నుండి తెలుగు బాక్సాఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయ్ కాని, ఎంతమంచి టాక్ వచ్చినా కూడా.. బాక్సాఫీస్ దగ్గర భారీ కలక్షన్లను రాబట్టడంలో విఫలమవుతున్నాయ్. ముఖ్యంగా ”కాంతారా” అనే డబ్బింగ్ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర్ 40 కోట్ల వసూళ్లు రాబట్టిన సందర్బంలో, అసలు మరేదైనా తెలుగు సినిమా దీన్ని బీట్ చేస్తుందా అంటూ అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పెద్ద స్టార్ సినిమాలొస్తే ఎలాగో కాంతారా కలక్షన్లను క్రాస్ చేయడం పెద్ద విషయంకాదులే కాని, కాంతారా టైపులో మరో చిన్న తెలుగు సినిమా కొడితేనే కిక్కుంటుంది.
కాంతారా రిలీజ్ అయిన తరువాత.. తెలుగులో రిలీజైన చిన్న సినిమాలను చూసుకుంటే.. మంచు విష్ణు జిన్నా, విశ్వక్సేన్ ఓరి దేవుడా అలాగే కార్తి సర్దార్ సినిమాలు రిలీజ్ అయ్యాయ్. ఆ తరువాత సంతోష్ శోభన్ లైక్ షేర్ సబ్‌స్ర్కైబ్, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో కూడా వచ్చాయ్. కాని వీటిలో పాజిటివ్ టాక్ వచ్చిన ఓరి దేవుడా, లైక్ షేర్ సబ్‌స్ర్కైబ్ సినిమాలు కూడా కలక్షన్ల విషయంలో చతికిలపడ్డాయ్. ఆ టైములో సమంత ‘యశోద’ సినిమా వస్తే కాంతారా సినిమా కలక్షన్లను బీట్ చేస్తుందని అందరూ ఆశించారు. ట్రేడ్ వర్గాలు కూడా అదే హోప్‌తో ఉన్నాయ్. కాని చూస్తుంటే కాంతారా ను బీట్ చేయడం సమంతకు కూడా కుదిరేపని కాదని తెలుస్తోంది.
మొదటి వీకెండ్లో ఓ 8 కోట్ల షేర్ రాబట్టిన యశోద.. వీక్ మధ్యలో బాగా వీక్ అయ్యింది. ఇప్పటివరకు మొత్తంగా 10 కోట్ల షేర్ వచ్చింది అంతే. ఒకవేళ ఈ వీకెండ్‌లో వేరే సినిమాల తాకిడి పెద్దగా లేదు కాబట్టి, యశోద సినిమా కాస్త పుంజుకున్నా కూడా.. కాంతారా తరహాలో ఓ 25 కోట్ల షేర్ వసూళ్లు సాధించడం కష్టమే. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో కాంతారా సినిమా హౌస్‌ఫుల్స్‌తో నడవడమే ఇందుకు కారణం. మరి సమంత చేయలేని పని తదుపరి ఎవరన్నా చిన్న హీరోలు చేస్తారో లేదో వేచి చూడాలి.