మహేష్‌కు 2022 శాపం

చిరునవ్వుకు చిరునామాగా.. సంతోషానికి కేరాఫ్ అడ్రస్‌ లాగా కనిపించే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పుట్టెడు దు:ఖంలో మునిగిపోయి ఉన్నాడు. ఇప్పుడందరూ ఆయన్ని చూసి అయ్యో అనుకుంటున్నారు. ఈ ఏడాది మహేష్ చూసిన విషాదాలు అలాంటివి. వయసు మీద తల్లిదండ్రులు ఏదో ఒక దశలో దూరం కావడం ఎవ్వరి జీవితంలోనైనా జరిగేదే. కానీ కేవలం నెలన్నర వ్యవధిలో జన్మనిచ్చిన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడం ఏ మనిషికైనా తట్టుకోవడం కష్టమే. ఇదే పెద్ద విషాదం అంటే.. తన తోడబుట్టిన సోదరుడిని సైతం ఈ ఏడాదే కోల్పోయాడు మహేష్. కేవలం పది నెలల వ్యవధిలో ఈ మూడు పెను విషాదాలు చోటు చేసుకున్నాయి.

ఈ ఏడాది జనవరిలో మహేష్ కొవిడ్ బారిన పడి నాలుగ్గోడలకు పరిమితం అయిన సమయంలో ఆయన సోదరుడు రమేష్ బాబు మృతిచెందారు. తన తోడబుట్టిన వాళ్లలో రమేష్‌తోనే మహేష్‌కు అనుబంధం ఎక్కువ అంటారు. మహేష్‌తో కలిసి సినిమాల్లో నటించడమే కాదు.. తాను సినిమాలకు దూరం అయ్యాక మహేష్ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో రమేష్ కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తిని తక్కువ వయసులోనే కోల్పోవడం.. పైగా కరోనా కారణంగా కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోవడం మహేష్ జీవితంలో అతి పెద్ద విషాదం.

అంతకుముందు ఏడాదే దశాబ్దాల నుంచి తనకు సినిమాల పీఆర్ వ్యవహారాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే, ఫాదర్ ఫిగర్ లాంటి బీఏ రాజును దూరం చేసుకోవడం మహేష్‌కు షాక్. తర్వాత అన్నయ్యను కూడా కోల్పోవడం గురించి ‘సర్కారు వారి పాట’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చాలా ఎమోషనల్ అయ్యాడు మహేష్. ఇవే పెద్ద విషాదాలు అనుకుంటే నెలన్నర కిందట తనకెంతో ఇష్టమైన తల్లి ఇందిరాదేవిని కోల్పోయాడు. ఆ విషాదం నుంచి తేరుకునేలోపే తండ్రి కృష్ణనూ దూరం చేసుకున్నాడు. మొత్తంగా చూస్తే 2022 సంవత్సరం మహేష్‌కు ఎప్పటికీ మరువలేని తీవ్ర విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి.