బాల‌య్య షోకు మాజీ సీఎం?

ప్ర‌స్తుతం తెలుగులో నంబ‌ర్ వ‌న్ టాక్ షో ఏది అంటే మ‌రో మాట లేకుండా అన్‌స్టాప‌బుల్ అని చెప్పేయొచ్చు. అల్లు వారి ఆహా ఓటీటీలో ప్ర‌సారం అయ్యే ఈ షో తొలి సీజ‌న్‌లో సూప‌ర్ హిట్ కాగా.. రెండో సీజ‌న్‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఆరంభం ల‌భించింది. త‌న బావ‌ నారా చంద్ర‌బాబు నాయుడు, అల్లుడు నారా లోకేష్‌ల‌తో బాల‌య్య చేసిన తొలి ఎపిసోడ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. 

ఆ త‌ర్వాత సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌-విశ్వ‌క్సేన్‌.. శ‌ర్వానంద్-అడివి శేష్‌ల‌తో బాల‌య్య చేసిన ఎపిసోడ్ల‌కు కూడా మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఇక త‌ర్వాత ఎపిసోడ్‌కు హాజ‌ర‌య్యే అతిథులు ఎవ‌రా అని అంతా ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఈసారి సినిమాల‌తో సంబంధం లేని ఇద్ద‌రు వ్య‌క్తులు ఈ షోకు రాబోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులో ఒక‌రు మాజీ పొలిటీషియ‌న్ కాగా మ‌రొక‌రు మాజీ క్రికెట‌ర్‌.

ఒక‌ప్ప‌టి త‌న క్లాస్ మేట్, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర చివ‌రి ముఖ్య‌మంత్రి అయిన న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డిని త‌ర్వాతి ఎపిసోడ్‌కు బాల‌య్య అతిథిగా ర‌ప్పిస్తున్నార‌ట‌. ఆయ‌న‌తో పాటు మాజీ క్రికెట‌ర్ అజ‌హ‌రుద్దీన్ కూడా ఈ షోకు హాజ‌ర‌వుతార‌ట‌. కిర‌ణ్ కుమార్ రెడ్డి, అజ‌హ‌రుద్దీన్ వ్య‌క్తిగ‌తంగా మంచి మిత్రులు. ఇద్ద‌రూ క‌లిసి దేశ‌వాళీ క్రికెట్లో క‌లిసి ఆడారు. ఇక బాల‌య్య‌తో కిర‌ణ్ కుమార్‌రెడ్డికి మంచి అనుబంధ‌మే ఉంద‌ని చెబుతారు. 

ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ కాలం అయిపోయాక‌, రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కిర‌ణ్ రాజ‌కీయాల నుంచి దాదాపుగా క‌నుమ‌రుగు అయిపోయారు. కొన్నేళ్ల నుంచి ఆయ‌న పేరే వినిపించ‌డం లేదు. ఇలాంటి టైంలో ఆయ‌న మ‌ళ్లీ లైమ్ లైట్లోకి వ‌స్తే అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొన‌డం ఖాయం. ఇక అజ‌హ‌ర్ మ్యాచ్ ఫిక్సింగ్, హెచ్‌సీఏ గొడ‌వ‌ల మీద మాట్లాడినా క్యూరియాసిటీ వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు.