బ‌న్నీ ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బాలీవుడ్ ద‌ర్శ‌కుడి విన్న‌పం

అల్లు అర్జున్ చివ‌రి సినిమా అల వైకుంఠపుర‌ములో విడుద‌లై ఆరు నెల‌లు కావ‌స్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసిందో.. ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా అల‌రించిందో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. టాలీవుడ్లో ఇది నాన్-బాహుబ‌లి రికార్డు న‌మోదు చేసింది. రిలీజైన రెండు నెల‌ల నుంచి ఆ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. త‌ర‌వ్ఆత‌ స‌న్ డైరెక్ట్‌లోకి కూడా వ‌చ్చింది. ఈ సినిమాలోని బుట్ట‌బొమ్మ‌, మ‌రికొన్ని పాటు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందాయి. ఐతే ఇంత పాపుల‌ర్ అయిన సినిమాను విడుద‌లైన ఆర్నెల్ల‌కు తీరిగ్గా నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన ద‌ర్శ‌కుడు సంజ‌య్ గుప్తా చాలా ఎగ్జైట్ అవుతూ దీనికి పెద్ద రివ్యూ ఇవ్వ‌డం విశేషం.

కాబిల్, షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా, జాజ్బా లాంటి సినిమాల‌తో బాలీవుడ్లో మంచి స్థాయినే అందుకున్న సంజయ్ గుప్తా.. అల వైకుంఠ‌పుర‌ములో సినిమా చూసి ట్విట్ట‌ర్లో స్పందించాడు. ‘‘ ఈ మ‌ధ్యే అల వైకుంఠపురములో సినిమాను నెట్ ఫ్లిక్స్‌లో చూశాను. స్వ‌చ్ఛ‌మైన వినోదం. ఈ సినిమాను పెద్ద తెర‌పై చూడ‌క‌పోతే.. ఆ లోటు ఎప్ప‌టికీ ఉండిపోతుంది. ప్ర‌స్తుత‌ ప‌రిస్థితులు కుదుట‌ప‌డ్డాక వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాలి’’.అని సంజ‌య్ ట్వీట్ చేశాడు. దీనికి బ‌న్నీ స్పందించాడు. త‌న సినిమా సంజ‌య్‌కు న‌చ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని ట్వీట్ చేశాడు. దానికి బ‌ద‌లుగా సంజ‌య్‌… ‘‘బ్ర‌ద‌ర్.. మీ న‌ట‌న‌కు నేను ఎంత‌లా క‌నెక్ట్ అయ్యానో చెప్పలేను. మీరు న‌న్ను న‌వ్వించారు.. ఏడిపించారు. జీవితాంతం నేను మీ అభిమానిని. మీతో ప‌ని చేయ‌డానికి ఒక్క అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నా’’ అంటూ ఆశ్చ‌ర్య‌క‌ర స‌మాధానం ఇచ్చాడు. సంజ‌య్ లాంటి పేరు మోసిన ద‌ర్శ‌కుడు మ‌న టాలీవుడ్ న‌టుడి గురించి, అతడి సినిమా గురించి ఎంత‌లా ఎగ్జైట్ అవుతూ మాట్లాడ‌టం ఆశ్చ‌ర్యకర‌మే.