ప్రామిసింగ్ డైరెక్టర్.. ఇలా అయిపోయాడేంటి?

దర్శకుడిగా తొలి సినిమాతో హిట్ కొట్టడం ఆషామాషీ విషయం కాదు. ఈ పని విజయవంతంగా పూర్తి చేసిన చాలామంది దర్శకులు ద్వితీయ విఘ్నం దెబ్బ తిన్న వాళ్లే. కానీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు మేర్లపాక గాంధీ.. ఆ తర్వాత ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తో ఇంకో సూపర్ హిట్ అందుకుని ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేశారు.

చిత్తూరు జిల్లాకు చెందిన లెజెండరీ రైటర్ మేర్లపాక మురళీ తనయుడైన గాంధీ.. రచయితగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే దర్శకుడిగా కూడా తనేంటో రుజువు చేసుకున్నాడు. తొలి రెండు చిత్రాలు సూపర్ హిట్లవడంతో అతడిపై అంచనాలు భారీగా పెరిగాయి. టాలీవుడ్లో పెద్ద రేంజికి వెళ్లగల యువ దర్శకుల్లో ఒకడిగా అతడిపై అందరికీ గురి కుదిరింది. కానీ గాంధీ మెరుపులు రెండు సినిమాలకే పరిమితం అయ్యాయి.

నేచురల్ స్టార్ నానితో అతను మంచి అంచనాల మధ్య తీసిన మూడో సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ తేడా కొట్టడంతో గాంధీ కెరీర్ తలకిందులైంది. ప్రథమార్ధం వరకు ఈ సినిమా కూడా బాగానే మెప్పించినా.. రెండో అర్ధం తేడా కొట్టడంతో డిజాస్టర్ ఫలితం తప్పలేదు. దీంతో గాంధీ కెరీర్లో బాగా గ్యాప్ వచ్చేసింది. మధ్యలో ఏదో ఆబ్లిగేషన్ మీద హిందీ మూవీ ‘అంధాదున్’ను నితిన్ హీరోగా రీమేక్ చేశాడు.

‘మ్యాస్ట్రో’ పేరుతో తెరకెక్కిన ఆ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజైంది. అక్కడ ఆశించిన రెస్పాన్స్ రాలేదు. గాంధీ గురించి అసలు చర్చే లేదు. ఈసారి తనేంటో రుజువు చేసుకోవాలని యువ కథానాయకుడు సంతోష్ శోభన్‌ను పెట్టి ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ సినిమా తీశాడు. ట్రెండీ టైటిల్ అయితే పెట్టాడు కానీ.. సినిమా ట్రెండీగా అనిపించలేదు. అసలీ టైటిలే సినిమాకు పెద్ద మైనస్ అయింది.

దీన్నొక ఫీచర్ ఫిలిం లాగే చూడలేదు జనాలు. రిలీజ్ టైంలో కూడా పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి మంచి కాస్టింగ్ పెట్టుకుని, చెప్పుకోదగ్గ బడ్జెట్లోనే సినిమా తీశారు. కానీ సినిమా ఏమాత్రం మెప్పించలేదు. కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాలేదు. పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఇక గాంధీని నమ్మి మరో నిర్మాత పెట్టుబడి పెట్టడం కష్టంగా ఉంది. కెరీర్ ఆరంభంలో అంత ప్రామిసింగ్‌‌గా కనిపించిన దర్శకుడు ఇంత వేగంగా ఆ స్తితికి చేరుకోవడం విచారకరం.