విశాల్.. ప్రేయసిని పరిచయం చేస్తాడట

టాలీవుడ్లో ప్రభాస్ లాగా.. కోలీవుడ్లో నాలుగు పదుల వయసొచ్చినా పెళ్లి చేసుకోకుండా.. దీర్ఘ కాలంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’లో ఒకడిగా కొనసాగుతున్నాడు విశాల్. పదేళ్ల కిందట్నుంచే అతడి పెళ్లి గురించి చర్చ జరుగుతోంది. ఒక దశలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌తో విశాల్ డీప్‌ లవ్‌లో ఉన్నారని.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.

ఆ వ్యవహారం సద్దుమణిగాక.. ‘అర్జున్ రెడ్డి’లో క్యారెక్టర్ రోల్ చేసిన అనీషాతో విశాల్‌కు నిశ్చితార్థం జరగడం.. ఆ తర్వాత ఏవో కారణాలతో అది రద్దు కావడం తెలిసిందే. ఆ తర్వాత విశాల్ పెళ్లి గురించి చర్చే లేదు. ఏళ్ల పాటు దీని గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోయిన సోషల్ మీడియా జనాలు, మీడియా వాళ్లు సైలెంట్ అయిపోయారు. ఈ మధ్య పెళ్లి గురించి విశాల్‌ను ప్రశ్నలు అడగడం కూడా మానేశారు. ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్ మళ్లీ తన పెళ్లి ఊసు ఎత్తాడు.

త్వరలోనే తనకు కాబోయే భార్యను పరిచయం చేయబోతున్నట్లు విశాల్ పేర్కొనడం విశేషం. ఎప్పట్లాగే నడిగర్ సంఘం భవనంతో తన పెళ్లికి ముడి పెట్టాడు విశాల్. ‘‘నటీనటుల యూనియన్ భవన నిర్మాణ పనులు మూడేళ్ల నుంచి కొనసాగుతున్నాయి. త్వరలోనే ఆ భవనం పూర్తవుతుంది. అది పూర్తయిన వెంటనే నేను పెళ్లి చేసుకుంటా. నాది ప్రేమ వివాహమే. నాకు కాబోయే అమ్మాయిని సమయం వచ్చినపుడు పరిచయం చేస్తా’’ అంటూ షాకిచ్చాడు విశాల్.

వరలక్ష్మితో, అనీషాతో పెళ్లి వైపు అడుగులు వేసినట్లే వేసి వెనక్కి తగ్గిన విశాల్.. ఇప్పుడు కొత్త అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తాడున్నాడా.. లేక ఊరికే ఇలా ఒక మాట అనేసి ఊరుకున్నాడా అన్నది అర్థం కావడం లేదు. ప్రస్తుతం విశాల్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. త్వరలోనే అతడి ‘లాఠీ’ మూవీ విడుదల కాబోతోంది. ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిటెక్టివ్-2’తో పాటు ‘మార్క్ ఆంటోనీ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విశాల్.