పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాక ప్రకటించిన ప్రాజెక్టుల్లో అభిమానులను అత్యంత ఎగ్జైట్ చేసిన సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’ అనడంలో మరో మాట లేదు. ‘గబ్బర్ సింగ్’ లాంటి మెగా బ్లాక్‌బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ మళ్లీ నటించబోతున్నాడనే వార్త బయటికి రాగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
కానీ అనౌన్స్ అయి మూడేళ్లు గడిచినా ఈ సినిమాకు సంబంధించి అడుగు కూడా ముందుకు పడలేదు. హరీష్ శంకర్ ఎప్పుడో స్క్రిప్టు రెడీ చేశాడు. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా చాలా ముందే లాంచ్ చేశారు. కానీ ఈ సినిమా సెట్స్ మీదికి తీసుకెళ్లే విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు. ఇదిగో అదిగో అంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి.
కొన్ని నెలల కిందట మైత్రీ మూవీ మేకర్స్ వారి ‘అంటే సుందరానికీ’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన పవన్.. త్వరలోనే ‘భవదీయుడు భగత్ సింగ్’ మొదలవుతుందని చేసిన ప్రకటన నీటి మీద రాతే అయింది. గత కొన్ని నెలల్లో ఈ సినిమా మొదలయ్యే సంకేతాలు ఎంతమాత్రం కనిపించలేదు. సమీప భవిష్యత్తులోనూ అలాంటి సూచనలు ఎంతమాత్రం లేవు.
తాజా సమాచారం ప్రకారం ఇక దర్శక నిర్మాతలకు పవన్ ఒక క్లారిటీ ఇచ్చేసినట్లు సమాచారం. ఇంకా వాళ్లను ఆశల పల్లకిలో ఊరేగించడం కరెక్ట్ కాదని భావించిన పవన్.. 2024 ఎన్నికల తర్వాత ఈ సినిమా సంగతి చూద్దామని స్పష్టంగా చెప్పేశాడట. తనకున్న పొలిటికల్ కమిట్మెంట్ల దృష్ట్యా ‘హరి హర వీరమల్లు’ మినహా వచ్చే ఎన్నికల్లోపు మరే సినిమా కూడా చేసే పరిస్థితి లేదని.. క్రిష్ సినిమాను పూర్తి చేయడమే కష్టంగా ఉందని.. కాబట్టి ‘భవదీయుడు భగత్ సింగ్’ను పక్కన పెట్టేసి వేరే సినిమాలు చూసుకోవాలని మైత్రీ అధినేతలకు, అలాగే హరీష్‌కు పవన్ క్లారిటీ ఇచ్చేసినట్లు సమాచారం. అభిమానులు కూడా ప్రస్తుతానికి ఈ సినిమా సంగతి మరిచిపోతే బెటర్ అన్నది చిత్ర వర్గాల సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates