గత వారం ఏకంగా పది సినిమాల దాకా రిలీజయ్యాయి. వాటిలో ఒక్క ‘ఊర్వశివో రాక్షసివో’ మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దానికి మాత్రమే చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. మిగతా సినిమాలు కనీస ప్రభావం చూపలేకపోయాయి. వీకెండ్ అయ్యాక ‘ఊర్వశివో రాక్షసివో’ కూడా డల్లయింది. ఇక ప్రేక్షకుల ఫోకస్ తర్వాతి వీకెండ్ మీదికి మళ్లింది.
ఈ శుక్రవారం సమంత సినిమా ‘యశోద’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే సమంత అనారోగ్యం వల్ల విడుదలకు ముందు అనుకున్న ప్రమోషనల్ ప్లాన్లు చెల్లాచెదురయ్యాయి. సామ్ అనారోగ్యంతోనూ ఒక వీడియో ఇంటర్వ్యూ చేసి మీడియాకు విడుదల చేసింది. ప్రమోషన్లు తక్కువ కావడం మైనస్ కాగా.. సామ్ అనారోగ్యం తాలూకు సింపతీ సినిమాకు ప్లస్ కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదైతేనేం బాక్సాఫీస్ డల్లుగా నడుస్తున్న టైంలో రిలీజవుతున్న ‘యశోద’ సామ్ బాక్సాఫీస్ సత్తాకు పరీక్షగా నిలవబోతోందన్నది స్పష్టం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అన్ని భాషల్లో కలిపి వరల్డ్ వైడ్ ఈ సినిమా రూ.23-24 కోట్ల మేర బిజినెస్ చేసింది.
విషయం ఉన్న సినిమాలా కనిపిస్తున్నప్పటికీ.. ‘యశోద’కు ఓపెనింగ్స్ తీసుకురావాల్సింది మాత్రం సమంతనే. ఆమె పేరు మీదే సినిమాకు బిజినెస్ జరిగింది. రేప్పొద్దున అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆమె ఆకర్షణ మీదే ఆధారపడి ఉంటాయి. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీతో రూ.40 కోట్ల గ్రాస్, రూ.24 కోట్ల షేర్ రాబట్టడం.. అది కూడా నవంబరులో అంటే అంత తేలికైన విషయం కాదు. మరి సమంత బాక్సాఫీస్ తన సత్తాను ఏమేర చూపిస్తుందో.. ‘యశోద’ను ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చూడాలి.