తమిళ బ్లాక్‌బస్టర్‌ను దించేస్తున్న దిల్ రాజు

ఒక సినిమా బాగుంది అని టాక్ వస్తే.. భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. నెల కిందట కన్నడ సినిమా ‘కాంతార’ కన్నడలో రేపుతున్న సంచలనం చూసి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ దీన్ని తెలుగులోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తే.. అపూర్వ రీతిలో ఆదరించారు. సినిమా రిలీజై మూడు వారాలు దాటినా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.50 కోట్లను దాటిపోగా.. షేర్ రూ.25 కోట్లకు చేరువగా ఉంది.

‘కాంతార’ జోరు చూసి.. ఇప్పుడు మరో అనువాద చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఐతే ఈసారి ఆ పని చేస్తోంది మరో అగ్ర నిర్మాత దిల్ రాజు కాగా.. ఆయన ఎంచుకున్నది ‘లవ్ టుడే’ అనే తమిళ చిత్రాన్ని.

ఇంతకుముందు జయం రవి హీరోగా ‘కోమాలి’ అనే కామెడీ సినిమా తీసి మెప్పించిన ప్రదీప్ రంగనాథన్ తనే స్వయంగా హీరోగా నటిస్తూ తెరకెక్కించిన సినిమా ‘లవ్ టుడే’ ఒక అమ్మాయి అబ్బాయి తమ మొబైళ్లను మార్చుకుని ఒక రోజంతా గడిపితే తలెత్తే పరిణామాల నేపథ్యంలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. తమిళ యువతకు ఈ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ట్రైలర్‌తోనే ఆకట్టుకున్న ఈ సినిమా తొలి రోజు నుంచి హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్తోంది.

తమిళంలో గత కొన్నేళ్లలో అది పెద్ద విజయం సాధించిన చిన్న సినిమాగా దీన్ని చెబుతున్నారు. తమిళంలో ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలను చూసి తెలుగులో ఎవరో ఒకరు రీమేక్ చేయడం గ్యారెంటీ అనుకున్నారు. కానీ ఈ లోపే దిల్ రాజు ఈ చిత్రాన్ని అనువాదం చేసి తెలుగులో రిలీజ్ చేసేస్తున్నారు. మరి ‘కాంతార’లా ఇది కూడా సంచలనం రేపుతుందేమో చూడాలి.