బింబిసార సినిమాలో ఫ్యాంటసీ బాగా వర్క్‌అవుట్ అవ్వడంతో.. ఇక అలాంటి క్రేజ్ సబ్జక్ట్‌లతోనే తెలుగు ప్రేక్షకులను అలరించాలని డిసైడ్ అయిపోయాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆల్రెడీ అందరూ బింబిసారా 2 సినిమాతో తమ ముందుకు వస్తాడేమోనని ఎదురు చూస్తుంటే, ఈ నందమూరి హీరో మాత్రం ఒక కొత్త పోస్టర్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ”ఎమిగోస్” (అంటే స్నేహితులు అని అర్ధం) అనే టైటిల్‌తో ఒక సినిమాతో వస్తున్నట్లు ప్రకటిస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశాడు. కాకపోతే పెద్ద ట్విస్టే ఇచ్చాడు.
తమలాగే ఉన్న మరో మనిషిని చూస్తే వెంటనే చచ్చిపోతాం అనే అర్ధాన్ని చెబుతూ, ‘They say when you meet somebody that looks just like you, you die’, అనే క్యాప్షన్ కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. పైగా కళ్యాణ్ రామ్ మూడు అవతారాల్లో కనిపిస్తున్నాడు. అంటే దానర్ధం.. ఈ సినిమాలో మనోడు మూడు రోల్స్ చేస్తున్నాడనమాట. బాగా హెయిర్ పెంచుకుని ఒక రోల్, మిలిటరీ కట్‌లో ఒక రోల్.. అలాగే కళ్ళద్దాల్లో మరో రోల్ అని పోస్టర్ చూస్తుంటే అర్దమవుతోంది. ఒక పాత్ర చేతిలో గన్, ఒకరి చేతిలో బ్యాగ్, మరొకరి చేయి ఖాళీ ఉండటంతో.. మూడు కూడా విభిన్నమైన రోల్స్ అని చెప్పుకోవచ్చు. మన దగ్గర ఒకే హీరో మూడు రోల్స్ పోషించిన సినిమాలు చాలా అరుదు. అలాంటి సినిమాల విషయానికొస్తే కొత్తతరానికి ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమాయే. కళ్యాణ్ రామ్ చేసిన ఈ సినిమా కూడా ఆ తరహాలో మూడు పాత్రలతో ఉంటుందట. అయితే ఈ పాత్రలు ఒకర్ని ఒకరు చూస్తే మాత్రం చచ్చిపోతారు అనేదే ట్విస్ట్. దాని చుట్టూతానే స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. చూస్తుంటే కళ్యాణ్ రామ్ మళ్ళీ కొత్తగానే ప్రయత్నిస్తున్నాడని అర్ధమవుతుందిలే.
పాతకాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ట్రిపుల్ యాక్షన్ సినిమాలు చేశారు. ఇక అత్యధిక ట్రిపుల్ యాక్షన్ సినిమాలు చేసిన ప్రపంచ రికార్డ్ సూపర్‌స్టార్ కృష్ణదే అనుకోవచ్చు. కొత్త తరంలో ట్రిపుల్ యాక్షన్ సినిమాలు చాలా రేర్. మెగాస్టార్ చిరు ఒక సినిమా, బాలయ్య మరో సినిమా (అధినాయకుడు) చేశారంతే. జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ యాక్షనే కాని, ఒక పాత్ర మాత్రం రెండు షేడ్స్ ఉండే పాత్ర చేస్తుంది.