కొత్త వివాదంలో విశ్వక్సేన్

టాలీవుడ్లో తన మాటలతో, లేదా చేతలతో తరచుగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే యువ కథానాయకుల్లో విశ్వక్సేన్ ఒకడు. ఆ మధ్య విశ్వక్ సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రమోషన్లలో భాగంగా అతను చేసిన ఒక ప్రాంక్ వీడియాకు సంబంధించి ఒక టీవీ ఛానెల్లో జరిగిన రచ్చ గురించి తెలిసిందే. తాజాగా విశ్వక్ మరో వివాదంలో చిక్కుకున్నాడు.

తమిళ సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించడానికి విశ్వక్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొన్ని రోజుల కిందట ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే సమయానికి ఏదో తేడా జరిగి ఈ సినిమా నుంచి విశ్వక్ తప్పుకున్నట్లు సమాచారం. ఇది సామరస్య పూర్వకంగా జరిగినట్లు కనిపించడం లేదు. సినిమా చేయడానికి అంగీకారం తెలిపి తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి విశ్వక్ హ్యాండ్ ఇవ్వడం పట్ల అర్జున్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

విశ్వక్ మీద తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయడానికి కూడా అర్జున్ సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతే కాక ఈ విషయంపై ప్రెస్ మీట్ కూడా పెట్టేందుకు గాను అర్జున్ హైదరాబాద్‌కు చేరుకున్నాడట. వివాదాలకు దూరంగా, చాలా సైలెంటుగా తన పని తాను చేసుకుపోయే అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్‌ను టార్గెట్ చేయబోతున్నాడంటే వ్యవహారం చాలా సీరియస్‌గానే కనిపిస్తోంది. మరి ఆయన విశ్వక్ గురించి ఏం చెబుతారో చూడాలి. ఆ తర్వాత విశ్వక్ ఏం వివరణ ఇస్తాడన్నది ఆసక్తికరం.

ఇటీవలే ‘ఓరిదేవుడా’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన విశ్వక్ చేతిలో ఇంకా చాలా ప్రాజెక్టులే ఉన్నాయి. స్వీయ దర్శకత్వంలో ‘దమ్కీ’ అనే సినిమా చేస్తున్న అతను.. ‘స్టూడెంట్’ అనే మరో చిత్రం కూడా చేయాల్సి ఉంది. ఇవి కాక మూణ్నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మరి అర్జున్ సినిమాను కథ నచ్చక వదిలేశాడా.. లేక ఇంకేదైనా కారణాలున్నాయా అన్నది తెలియాల్సి ఉంది.