ఎవరూ ఊహించని విధంగా ఊర్వశివో రాక్షసివోకి డీసెంట్ టాక్ వినిపిస్తోంది. ఇవాళ రిలీజైన పది సినిమాల్లో పబ్లిక్ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతోంది దీనికే. అలా అని యునానిమస్ బ్లాక్ బస్టర్ రేంజ్ కాదు కానీ ఇప్పుడీ స్పందనని గీతా సంస్థ ఎలా మార్కెటింగ్ చేసుకుంటుందనే దాన్ని బట్టి కలెక్షన్లు పెరగడం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ సెంటర్స్ మినహాయించి మార్నింగ్, మ్యాట్నీలకు పెద్దగా ఓపెనింగ్స్ రాలేదు. కంటెంట్ ఏముందో మెల్లగా యూత్ కి తెలిసిపోవడంతో రేపటి నుంచి వసూళ్లలో పెరుగుదల ఉంటుందని ట్రేడ్ ఆశిస్తోంది. పెద్ద బ్యానర్ కావడంతో థియేటర్లు పుష్కలంగా దొరికాయి.
సరే కాసేపీ సంగతి పక్కనపెడితే ఊర్వశివో ప్రేయసివోలో రొమాంటిక్ యాంగిల్ ని పుష్కలంగా దట్టించడం కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతుందేమో అనిపిస్తోంది. లిప్ టు లిప్ ముద్దు సీన్లు, సెక్స్ ని ప్రేరేపించే ఇంటిమసీ సన్నివేశాలు దేనికీ లోటు లేకుండా దర్శకుడు రాకేష్ శశి అన్నీ జోడించారు. కాకపోతే మరీ వెగటుగా అనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఎలా చూసుకున్నా ఇంత మోతాదులో హాట్ కంటెంట్ ఈ మధ్యకాలంలో అయితే రాలేదు. ఒకవేళ శిరీష్ కాకుండా వేరే ఎక్కువ గుర్తింపు ఉన్న హీరో అయితే ఈపాటికి టాక్ అఫ్ ది ఆడియన్స్ గా మారేదన్న కామెంట్ లో నిజం లేకపోలేదు.
గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. చిత్రంలో ఉదయ్ కిరణ్ రీమా సేన్ ల మధ్య టీనేజ్ కెమిస్ట్రీని తేజ చూపించిన తీరు పెద్ద హిట్టు ఇచ్చింది. 7జి బృందావన్ కాలనీలో రవికృష్ణ సోనియా అగర్వాల్ ల రొమాన్స్ ని సెల్వ రాఘవన్ చిత్రీకరించిన విధానం కల్ట్ క్లాసిక్ గా నిలబెట్టింది. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఊర్వశివో రాక్షసివోని వాటి సరసన నిలబెట్టలేం కానీ అటెంప్ట్ పరంగా చూసుకుంటే శిరీష్ తో చేయించింది మాత్రం రిస్కే. అను ఇమ్మానియేల్ తో తన ఎపిసోడ్స్ కుర్రకారు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇది ట్రెండ్ కి దారి తీస్తుందా లేక ఒక్క సినిమాతో ఆగుతుందా చూడాలి.