అవతార్ 2లో పండోరా విశ్వరూపం

కోట్లాది కళ్ళు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన అవతార్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఒకపక్క బంగ్లాదేశ్ తో ఉత్కంఠభరిత వరల్డ్ కప్ చూసిన ఆనందం ఇంకా పచ్చిగా ఉండగానే చెప్పిన టైం కన్నా బాగా ఆలస్యంగా ఈ హాలీవుడ్ మూవీ వీడియో వచ్చేసింది. పండోరా ప్రపంచంలో తమ ఉనికే ప్రమాదంలో పడ్డప్పుడు భార్యతో పాటు జాతి మొత్తానికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత జాక్(సామ్ వర్తింగ్ టన్) మీద పడుతుంది. తమ భూగ్రహాన్ని ఆక్రమించుకోవడనికి వచ్చిన మానవ రోబోలను, మెషీన్లను, అత్యాధునిక సాంకేతికతను ఎదుర్కునే సవాల్ తీసుకుంటాడు. ఆ యుద్ధంలో ఎలా విజేతగా నిలిచాడనేదే అవతార్ 2 కథ.

విజువల్స్ ఆశించినట్టే ఉన్నాయి. జలచరాలు, అడవి నేపథ్యం, ఆకుపచ్చ నీలం కలిసిన ఒక డిఫరెంట్ కలర్ స్కీంలో విచిత్రమైన అనుభూతినిచ్చే సన్నివేశాలు మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. అంతా బాగానే ఉంది కానీ అవతార్ మొదటి భాగాన్ని విపరీతంగా ఇష్టపడిన వీరాభిమానులు సంగతి పక్కన పెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం ఇది ఫస్ట్ పార్ట్ లాగే ఉంది కదానే ఫీలింగ్ కలుగుతుంది. బాహుబలి లాగా ఇదీ కొనసాగింపే కాబట్టి పోలికలు సహజమే కానీ ట్రైలర్ ని ఎక్కువ కంటెంట్ రివీల్ కాకుండా జాగ్రత్తగా కట్ చేయడంతో ఇంతకన్నా ఏం చెప్పుకోలేం.

మొత్తానికి త్రీడి వరల్డ్ లో అవతార్ 2 ఎలా ఉండబోతోందన్న ఉత్సుకత ఈ ట్రైలర్ పెంచేసింది. న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం వేచి చూసి బాగుందంటే వెళదామనే తీరులో ఉంది. జేమ్స్ క్యామరూన్ దర్శకత్వ ప్రతిభ గురించి, మేధస్సు గురించి ఈ రెండున్నర నిమిషాల్లో పూర్తిగా జడ్జ్ చేయలేం కానీ డిసెంబర్ 16న చూసే తీరాలని నిర్ణయించుకున్న ఫ్యాన్స్ కి మాత్రం కిక్కిచ్చేలా ఎడిట్ చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ దేనికవే పోటీ పడేలా ఉన్నాయి. 3 గంటల 9 నిమిషాల నిడివితో రాబోతున్న అవతార్ 2 పండోరా వరల్డ్ లో ప్రవేశించడానికి ఇంకో 45 రోజులు ఆగితే చాలు.