హ్యాట్రిక్ వేటలో కమల్ కూతురు

ఒకే యాక్టర్ కి చెందిన రెండు సినిమాలు ఒకే వారంలో రిలీజ్ అవ్వడం చాలా అరుదుగా చూస్తుంటాం. వచ్చే సంక్రాంతికి హీరోయిన్ శృతి హాసన్ నటించిన రెండు సినిమాలు ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. చిరంజీవి తో శృతి హాసన్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తుంది. అలాగే మరో వైపు బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ లో కూడా శృతి హాసన్ నే హీరోయిన్. ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. ఇంకా రిలీజ్ డేట్స్ ఫిక్స్ కాలేదు కానీ ఒకే వారంలో రోజుల గ్యాప్ లో ఈ రెండూ థియేటర్స్ లోకి రావడం పక్కా అని తెలుస్తుంది.

అయితే ఈ రెండు సినిమాల సక్సెస్ శృతి హాసన్ కి చాలా ముఖ్యం. ఇటు చిరు అటు బాలయ్య రెండు బడా సినిమాలతో సంక్రాంతి డబుల్ బొనంజా కొడితే శృతి హాసన్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది. అలాగే ఇద్దరితోనూ శృతి ఫస్ట్ టైం జోడీ కట్టింది. రెండూ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇద్దరికీ శృతి సెంటిమెంట్ గా మారిపోతుంది.

ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో మరో బడా సినిమా కూడా ఉంది. ప్రభాస్ ‘సలార్’ లో కూడా శృతి నే హీరోయిన్. ఆ సినిమా కూడా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రాబోతుంది. సంక్రాంతి కి రెండు బ్లాక్ బస్టర్స్ అలాగే సలార్ తో ఇంకో బ్లాక్ బస్టర్ కొడితే 2023 శృతి నామ సంవత్సరం అయిపోతుంది. మరి శృతి హాసన్ ఈ రేర్ ఫీట్ టచ్ చేసి హ్యాట్రిక్ సాదిస్తే ఇక అమ్మడుకి తెలుగులో ఇంకొన్నేళ్ళ పాటు తిరుగుండదు.