ఏమో నిజమే అంటున్నాయి చెన్నై ఫిలిం వర్గాలు. కమల్ హాసన్ కు విక్రమ్ రూపంలో బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన తర్వాతి సినిమా విజయ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. మాస్టర్ ని మించిన అదిరిపోయే స్క్రిప్ట్ ని సిద్ధం చేశానని పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చిన లోకేష్ దానికి తగ్గట్టే క్యాస్టింగ్ ని సెట్ చేసే పనిలో ఉన్నాడు. అందులో భాగంగానే విశాల్ ని ప్రతినాయకుడి పాత్రకు అడిగినట్టు తెలిసింది. ప్రస్తుతం అతను నటిస్తున్న మార్క్ ఆంటోనీ షూటింగ్ స్పాట్ లో ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకోవడం దానికే సంకేతమని చెబుతున్నారు.
నిజానికీ పాత్రను ముందు అనుకున్నది పృథ్విరాజ్ సుకుమారన్ ని. అయితే డేట్స్ ఖాళీగా లేవు. ఆల్రెడీ సలార్ లో విలన్ గా చేస్తూ మళ్ళీ ఇంకో ప్యాన్ ఇండియా మూవీలో మరోసారి అంటే ఇబ్బంది కనక సున్నితంగా నో చెప్పినట్టు వినికిడి. కానీ విశాల్ ఒప్పుకుంటాడా లేదానేదే పెద్ద ప్రశ్న. ఫామ్ లో ఉన్నా లేకపోయినా విశాల్ ఇప్పటికీ హీరోనే. కాకపోతే ట్రాక్ రికార్డు ఎగుడుదిగుడుగా ఉంది. అభిమన్యుడు హిట్టు కొట్టాక పందెం కోడి 2, చక్ర, సామాన్యుడు ఇవేవీ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. లాఠీ ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్నా బిజినెస్ ఇబ్బందులతో రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసుకోలేకపోతోంది.
ఇక మార్క్ ఆంటోనీలోనూ చాలా విభిన్నమైన పాత్రను చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో విశాల్ విజయ్ ని ఢీ కొట్టేందుకు ఒప్పుకుంటాడా లేదానేది వేచి చూడాలి. విజయ్ సేతుపతి మంచి ఛాయసే కానీ ఆల్రెడీ లోకేష్ తోనే రెండుసార్లు చేశాడు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తే రొటీన్ అయిపోతుంది. అందుకే విశాల్ ని ట్రై చేస్తున్నాడు. అయినా ఇప్పుడున్న ట్రెండ్ లో విలన్ గా చేయడం ఎవరికీ మైనస్ కాదు. ఆడియన్స్ పెర్ఫార్మన్స్ ప్లస్ కంటెంట్ చూస్తున్నారు తప్ప అయ్యో ఈ హీరో ఎందుకిలా ఒప్పుకున్నాడని ఫీలవ్వడం లేదు సినిమాలో విషయం ఉంటే. చూద్దాం విశాల్ ఏం చేయనున్నాడో.