రాజకీయ వాతావరణం ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతున్న పరిస్థితుల్లో జనసేన కార్యకలాపాల్లో మునిగితేలుతున్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు షూటింగులకు అందుబాటులో ఉంటాడో అర్థం కాక నిర్మాతలకు పెద్ద చిక్కే వచ్చింది. మాములుగా అయితే హరిహర వీరమల్లు ఈపాటికి పూర్తవ్వాల్సింది. కానీ కరోనాతో మొదలుపెట్టి రకరకాల కారణాల వల్ల ఆగుతూ సాగుతూ ఇటీవలే కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టుకుంది. వీలైనంత త్వరగా ఫినిష్ చేసే లక్ష్యంతో దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నం, పవన్ లు పక్కా ప్లానింగ్ తో రాబోయే ఫిబ్రవరికంతా గుమ్మడికాయ కొట్టేలా మొత్తం సెట్ చేసుకున్నారని సమాచారం.
దీంతో సమానంగా అభిమానులకు భవదీయుడు భగత్ సింగ్ మీద ఎన్నో ఆశలున్నాయి. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రాజెక్టు కావడంతో చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ రియల్ మాస్ చూస్తామనే అంచనాతో ఉన్నారు. వీరమల్లు ఎంత గొప్పగా ఆడినా అది పీరియాడిక్ డ్రామా కాబట్టి కమర్షియల్ ఎలివేషన్లని ఎక్కువగా ఆశించలేం. అదే భగత్ సింగ్ లో అయితే బోలెడు స్కోప్ ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తుంటే ఇది ఆగిపోవడమో లేదా 2024 ఎన్నికలు అయ్యాక మొదలుకావడమో జరుగుతుందని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న ఇన్ సైడ్ టాక్. దీనికి కారణం లేకపోలేదు.
భవదీయడు భగత్ సింగ్ ఏదో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాగా తక్కువ బడ్జెట్ అండ్ లొకేషన్లతో వేగంగా పూర్తి చేసే రీమేక్ కాదు. స్ట్రెయిట్ సబ్జెక్టు. ఎంతలేదన్నా ఆరేడు నెలలు కావాలి. కానీ పవన్ వచ్చే వేసవి నుంచే ప్రచారం ఇతరత్రా కార్యక్రమాలు మొదలుపెట్టాలి. పూర్తిగా ప్రజా క్షేత్రంలో ఉండాలి. ఏ ఎమ్మెల్యేనో మంత్రో అయ్యుంటే ఇబ్బంది లేదు కానీ ఈసారి ఎలక్షన్ హీట్ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఎలాగైనా జనసేనను బలంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఉన్నాడు పవన్. హరీష్ శంకర్ అప్పుడప్పుడు ప్రాజెక్ట్ ఆన్ అని చెబుతూ వచ్చాడు కానీ ఇప్పుడూ అంతే కాన్ఫిడెంట్ గా చెప్పగలరో లేదో.
Gulte Telugu Telugu Political and Movie News Updates