తమిళ స్టార్లకు చేతకావట్లేదా?

రజినీకంత్, కమల్, సూర్య, కార్తి లాంటి తమిళ స్టార్లు తెలుగులో ఎంత ఫాలోయింగ్ సంపాదించారో తెలిసిందే. వాళ్లందరూ తెలుగు వెర్షన్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టబట్టే ఇక్కడ వారికి ఫాలోయింగ్, మార్కెట్ వచ్చాయి. కమల్ అయితే తెలుగు నేర్చుకుని నేరుగా తెలుగులో క్లాసిక్స్ చేశాడు. రజినీకాంత్ కూడా తెలుగులో సినిమాలు చేశాడు. ఆ తర్వాత తన తమిళ చిత్రాల డబ్బింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.

ఇక సూర్య, కార్తి లాంటి వాళ్లు తెలుగు వెర్షన్ల మీద చూపిన శ్రద్ధ, తెలుగు ప్రేక్షకులకు ఇచ్చే గౌరవం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ వీళ్లు ఎలా సక్సెస్ అయ్యారన్నది మిగతా తమిళ స్టార్లు అర్థం చేసుకోవట్లేదు. తెలుగులో మార్కెట్ పెంచుకోవాలన్న ఆశ బాగుంది కానీ.. అందుకోసం కష్టపడడానికి సిద్ధంగా లేరు.

శివ కార్తికేయన్ విషయానికి వస్తే.. వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ సినిమాలతో అతడికి ఇక్కడ కాస్త ఫాలోయింగ్ వచ్చింది. ‘ప్రిన్స్’ సినిమాను తెలుగులో చేసి ఉంటే.. ఆ ఫాలోయింగ్ పెరిగేది. సినిమా ఓ మోస్తరుగా వర్కవుట్ అయ్యేది. కానీ అతను తమిళం వరకే సినిమా చేశాడు. దాన్ని తెలుగులోకి డబ్ చేశారు. ముందు దీన్ని ద్విభాషా చిత్రంగా ప్రమోట్ చేసి.. ట్రైలర్ లాంచ్ అప్పుడు చూస్తేనేమో డబ్బింగ్ సినిమా అని క్లారిటీ వచ్చింది. సినిమాలో తమిళ వాసనలు గుప్పుమనడంతో అనుదీప్ మార్కు కామెడీ పండలేదు.

ఇప్పుడు విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమా కూడా ఇదే కోవలో ఉండబోతోందని దర్శకుడు వంశీ పైడిపల్లి క్లారిటీ ఇచ్చేశాడు. ఇన్నాళ్లూ దీన్ని కూడా బైలింగ్వల్ మూవీ అనే అనుకున్నారు. కానీ వంశీ ఇది తమిళ సినిమా అని.. తెలుగులోకి డబ్ చేస్తున్నామని తేల్చేశాడు. మరి ఇన్నాళ్లూ ద్విభాషా చిత్రంగా ఎందుకు చెప్పుకున్నారో అర్థం కావట్లేదు. వేర్వేరుగా సినిమా తీయడానికి టైం సరిపోలేదా.. లేక ఆ స్టార్లు అంత కష్టపడడానికి సహకరించట్లేదా అన్నది అర్థం కావడం లేదు. తెలుగులో ఫాలోయింగ్, మార్కెట్ మాత్రం కావాలి.. ఆ భాషలో కాస్త శ్రద్ధ పెట్టి సినిమా మాత్రం చేయలేరు. అలాంటపుడు రజినీ, కమల్, సూర్య, కార్తి లాంటి ఫాలోయింగ్ ఎలా వస్తుంది వీళ్లకి?