అసలెలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ కిల్లర్ గా విడుదలైన కాంతార డ్రీం రన్ బాక్సాఫీస్ వద్ద భీభత్సంగా కొనసాగుతోంది. దీపావళికి అన్ని భాషల్లో వచ్చిన ఏ సినిమాకూ యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడం రిషబ్ శెట్టి బృందానికి బాగా కలిసి వచ్చింది. స్క్రీన్ కౌంట్ గణనీయంగా తగ్గినా సరే జనం ఏ థియేటర్లో ఆడుతోందో తెలుసుకుని మరీ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో శని ఆదివారాలు దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ జరిగిన దాఖలాలున్నాయి. దీనికి భిన్నంగా లేటెస్ట్ మూవీస్ ప్రిన్స్, ఓరి దేవుడా, జిన్నాలు ఈ స్థాయి దూకుడు చూపించకపోవడం గమనార్హం.
ఇప్పుడు మరో రికార్డు వచ్చి చేరింది. కాంతారను నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల్లో కాంతారనే అత్యధిక ఫుట్ ఫాల్స్ నమోదు చేసుకున్న మూవీగా చరిత్ర సృష్టించింది. కేవలం పాతిక రోజుల్లోనే ఈ కౌంట్ 80 లక్షల దాకా ఉందట. కెజిఎఫ్ 1 ఫుల్ రన్ లో 75 లక్షలు, కెజిఎఫ్ 2 ఫైనల్ ఫిగర్ 72 లక్షలు ఉండగా కోళ నృత్యంతో రిషబ్ శెట్టి చేసిన మేజిక్ వాటిని పెద్ద మార్జిన్ తో దాటేసే దిశగా పరుగులు పెడుతోంది. కోటి మార్కుని అందుకోవడం లాంఛనమేనని ట్రేడ్ పండితుల విశ్లేషణ. ఒకవేళ ఇంకో నెల రోజుల పాటు కాంతారను కొనసాగితే ఇంకా ఎక్కువ వస్తుంది.
తెలుగు కన్నడలోనే హిందీ మలయాళంలోనూ కాంతార స్పీడ్ తగ్గడం లేదు. ఊహించని ఇంత పెద్ద విజయానికి హోంబాలే బ్యానర్ వేల్యూ మరింతగా పెరిగిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఏ బాషా పరిశ్రమలో ఈ స్థాయి క్వాలిటీ కంటెంట్ తో సినిమాలు తీస్తున్న పెద్ద సంస్థలు లేవు. రెగ్యులర్ కథల జోలికి వెళ్ళకుండా సీరియస్ జానర్ లోనే తీస్తున్నా అద్భుతమైన ఫలితాలు అందుకుంటున్న హోంబాలే సెలక్షన్ ని ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు. అందుకే ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి పెద్ద స్టార్లు అడగ్గానే డేట్లు ఇచ్చేస్తున్నారు.