సంక్రాంతి.. యమ డేంజర్


దసరా సందడి ముగిసింది. దీపావళి హంగామా నడుస్తోంది. ఇక తర్వాత అందరి దృష్టీ సంక్రాంతి మీదికి మళ్లబోతోంది. తెలుగు సినిమాలకు సంబంధించి అతి పెద్ద పండుగ సీజన్ అయిన సంక్రాంతికి దాదాపుగా బెర్తులు ఖరారైపోయినట్లే. ఈసారి ఏకంగా నాలుగు భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజైన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ.. అందులో రెండుకు మించి భారీ సినిమాలుండేవి కావు.

రెండు పెద్ద సినిమాలు రిలీజైతే.. వాటికి తోడు ఒకటో రెండో మీడియం రేంజ్ సినిమాలు రిలీజయ్యాయి. అయినా సరే థియేటర్లు సర్దుబాటు చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ 2023 సంక్రాంతికి మాత్రం రిలీజవుతున్న నాలుగు సినిమాలూ భారీ స్థాయివే. అందులో ప్రభాస్ మూవీ ‘ఆదిపురుష్’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతుండగా.. చిరంజీవి చిత్రం ‘వాల్తేర్ వీరయ్య’, బాలయ్య సినిమా ‘వీరసింహారెడ్డి’ తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదల మీద కన్నేశాయి. వీటికి తోడు ద్విభాషా చిత్రం ‘వారసుడు’ కూడా ఉంది.

ఈ నాలుగు చిత్రాల వెనుక భారీ నిర్మాణ సంస్థలే ఉన్నాయి. థియేటర్ల విషయంలో ఎవరికి వారు గట్టిగా లాబీయింగ్ చేసుకోగల వాళ్లే. మరి వీరి మధ్య ఏమాత్రం సర్దుబాటు జరుగుతుందో.. థియేటర్ల కేటాయింపు ఏమాత్రం సవ్యంగా సాగుతుందో చూడాలి. ఈ సంగతి పక్కన పెడితే.. ఇలా నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడడం వల్ల కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. నాలుగుకు నాలుగు సినిమాలూ చూసే ప్రేక్షకులు అరుదు. టాక్‌ను బట్టి రెండు సినిమాలను ఎంచుకుంటారు. అలాంటపుడు టాక్ బాగా లేని సినిమాల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అసలే తక్కువ థియేటర్లలో రిలీజవుతాయి కాబట్టి ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో ఉండవు. ఇలాంటి పరిస్థితిలో సినిమాను రిలీజ్ చేయడం చాలా డేంజర్ అనే చెప్పాలి.

ఎవరికి వాళ్లు తమ సినిమా మీద ధీమాగానే ఉంటారు కానీ.. థియేటర్లలోకి దిగాక కథ వేరుంటుంది. తుది నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. పబ్లిసిటీతో మాయ చేయడం కూడా కష్టం. ప్రేక్షకుల తీర్పు చాలా స్పష్టంగా ఉండే టైం అది. ఈ స్థితిలో ఒకట్రెండు సినిమాలకు గట్టి పంచ్ తప్పదు. అలా అన్యాయం అయిపోయే సినిమాలేవో చూడాలి.