నవ్వుల మీదే ప్రిన్స్ భారం

తన డబ్బింగ్ సినిమాలు ఎప్పటి నుంచో తెలుగులో వస్తున్నా వరుణ్ డాక్టర్, కాలేజీ డాన్ లు హిట్టయ్యాకే శివ కార్తికేయన్ కు ఇక్కడి మార్కెట్ మీద నమ్మకం కలిగింది. అందుకే తమిళంలో ఎన్ని ఆఫర్లున్నా టాలీవుడ్ డైరెక్టర్ అనుదీప్ కే ఓటేశాడు. ముగ్గురు అగ్ర నిర్మాతలు తోడవ్వడం, తమన్ లాంటి క్వాలిటీ టెక్నికల్ టీమ్ సెట్ కావడంతో అంచనాలు బాగానే నెలకొన్నాయి. దీపావళిని టార్గెట్ చేసుకుని సర్దార్, జిన్నా, ఓరి దేవుడాతో పోటీకి సై అన్న ప్రిన్స్ బృందం ప్రమోషన్ కోసం అదే పనిగా చెన్నై కంటే ఎక్కువగా హైదరాబాద్ లోనే సమయం గడిపింది. అంతగా మన ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొదటి రోజే ప్రిన్స్ కు యునానిమస్ హిట్ టాక్ రాలేదు కానీ జాతిరత్నాలు తరహాలో కేవలం నవ్వుల మీదే భారం వేసి ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఉదయం తక్కువగా ఉన్న ఆక్యుపెన్సీలు సాయంత్రం నుంచి పికప్ అయ్యాయి. జిన్నా రొటీన్ ఫ్లేవర్ జనానికి ఎక్కడం లేదని కలెక్షన్లు చూస్తే అర్థమవుతోంది. సర్దార్ వైపు యాక్షన్ లవర్స్ మొగ్గు చూపుతున్నారు. ఓరి దేవుడా బాగుందనే మాట బయటకొచ్చింది కానీ ఎంటర్ టైన్మెంట్ కోణంలో హిలేరియస్ అనిపించులేదు. ఇది ఫ్యామిలీ సెక్షన్ మీద ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందనేది ఇంకో రెండు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.

మొత్తానికి ప్రిన్స్ లో సరిపడా కామెడీ ఉన్నా లాజిక్స్ ని పూర్తిగా వదిలేశారు. అవేవి అక్కర్లేదనుకుంటే హ్యాపీగానే ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం అవసరానికి మించి క్లాసులు తీసుకోవడం, ఎమోషన్ల ల్యాగ్ వగైరా ఉన్నప్పటికీ టైంపాస్ కోణంలో చూసుకుంటే ప్రిన్స్ తీవ్రంగా నిరాశపరిచే ప్రమాదాన్ని తగ్గించుకున్నాడు. కాకపోతే విశ్వక్ సేన్, కార్తీలతో పోటీని తట్టుకుని వాటిని ఎలా క్రాస్ చేస్తాడనే దాని మీదే బాక్సాఫీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. అనుదీప్ మార్క్ వన్ లైనర్స్ ఇలా ప్రతిసారి వర్కౌట్ అవుతాయని చెప్పలేం. రాబోయే సినిమాల్లో కథాకథనాల మీద ఇంకొంచెం సీరియస్ ఫోకస్ పెట్టాలనే అభిప్రాయమైతే వినిపిస్తోంది.