ఇంకో రెండు రోజుల్లో రానున్న దీపావళిని టార్గెట్ చేసుకుని నిన్న ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు పోటీ పడటం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. అయితే దానికి తగ్గట్టు ఉదయం షోలకు థియేటర్ల వద్ద భారీ సందడి కనిపించలేదు. కొన్ని మెయిన్ సెంటర్లు తప్ప అన్ని చోట్ల పరిస్థితి ఓ మోస్తరుగానే అనిపించింది. వీటిలో కార్తీ డబ్బింగ్ మూవీ సర్దార్ మీద అభిమానులకు గట్టి అంచనాలున్నాయి. ఖైదీ సూపర్ హిట్ తర్వాత తెలుగులో తగ్గిపోయిన తన మార్కెట్ ని తిరిగి సంపాదించుకున్న కార్తీకి ఫలితంతో సంబంధం లేకుండా ఇష్టపడే మూవీ లవర్స్ కోకొల్లలుగా ఉన్నారు. ఇంతకీ సర్దార్ ఎలా ఉందనే ఆసక్తి కలగడం సహజం
ఇదో గూఢచారి కథ. 1983లో ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాక దేశద్రోహి ముద్రపడి ఇండియా కోసం పనిచేస్తున్న సర్దార్(కార్తీ)వేరే దేశంలో యుద్ధ ఖైదీగా ముప్పై ఐదేళ్లు మగ్గాల్సివస్తుంది. ఇతని కొడుకు విజయ్ ప్రకాష్(కార్తీ)పోలీస్ ఆఫీసర్ గా తన తండ్రిని ద్వేషిస్తూ పెరుగుతాడు. భారతీయులు వాడే ప్రతి నీటి చుక్కను అమ్మాలనే లక్ష్యంతో చైనాతో చేతులు కలిపిన ఒక మాజీ రా ఆఫీసర్(చుంకీ పాండే)వల్ల లక్షలాది చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. దాంతో సర్దార్ తిరిగి వచ్చే పరిస్థితులు తలెత్తుతాయి. అప్పుడీ తండ్రికొడుకులు ఎలా శత్రువుల భరతం పట్టారనేదే సర్దార్ అసలు స్టోరీ.
అభిమన్యుడు, శక్తిలో చెరో సామజిక సమస్యను తీసుకుని దానికి కమర్షియల్ అంశాలు జోడించిన దర్శకుడు పిఎస్ మిత్రన్ ఈసారి ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లను అమ్ముతూ మన ఆరోగ్యంతో చెలగాటమాడే సీరియస్ పాయింట్ ని ఎంచుకున్నాడు. ఆద్యంతం ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించినప్పటికీ అవసరం లేని పాటలు, సుదీర్ఘంగా సాగే యాక్షన్ ఎపిసోడ్స్, ఓవర్ ది బోర్డ్ అనిపించే లాజిక్స్ అసలు ఉద్దేశాన్ని కొంత దెబ్బ తీశాయి. అయినా కూడా సర్దార్ యాక్షన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవాళ్ళను ఖచ్చితంగా మెప్పిస్తుంది. ముఖ్యంగా కార్తీ పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జివి ప్రకాష్ నేపధ్య సంగీతం ఒకటే ఆశించిన స్థాయిలో లేదు.