నవ్విపోదురుగాక నాకేంటి అనే రీతిలో ఇతను హీరోనాని సోషల్ మీడియాలో ఎంత కామెడీ చేస్తున్నా సరే డెబ్భై కోట్ల బడ్జెట్ తో తెర ముందుకు వచ్చిన హీరో శరవణన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. లెజెండ్ పేరుతో ఈయన తీసిన కళాఖండం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఎక్కడా కనీసం థియేటర్ల అద్దెలు గిట్టుబాటు అయ్యే స్థాయిలో ఆడని ఈ సినిమా ఓటిటి ప్రీమియర్ కోసం ఫ్యాన్స్ కాని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య డిస్నీ హాట్ స్టార్ లో వస్తుందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరిగింది.
తాజాగా షాక్ ఇచ్చే విషయం ఏంటంటే ఈ లెజెండ్ ఏ ఓటిటిలోనూ రాబోవడం లేదు. ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదని చెన్నై టాక్. శరవణన్ దీన్ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కు ఇచ్చేందుకు సుముఖంగా లేరట. కొన్ని డిజిటల్ సంస్థలు మంచి మొత్తమే ఆఫర్ చేసినప్పటికీ నిర్మొహమాటంగా తిరస్కరించారని తెలిసింది. ఆయనకున్న వందల వేల కోట్ల ఆస్తులతో పోలిస్తే ఇప్పుడీ డీల్ వల్ల వచ్చే మొత్తం ఎంతైనా సరే చిల్లరతో సమానం. అందుకే దాని గురించి అసలు ఆలోచించనే లేదని సన్నిహితుల మాట. మరి శాటిలైట్ కైనా ఇచ్చారా అంటే అది కూడా డౌటేనట.
నిజానికి దీని కోసం జనం ఎదురు చూసింది సినిమా ఏదో బ్రహ్మాండంగా ఉందని కాదు. ట్రోలింగ్ పేరుతో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ టాలో ఆ వీడియోలను వాడుకోవడానికి. కానీ శరవణన్ ఆ ఛాన్స్ ఇచ్చేలా లేరు. అన్నట్టు పబ్లిక్ తనను ఎంత దారుణంగా తిరస్కరించినా సరే ఈయన సినిమాలు చేయడం ఆపరట. రెండో ప్రాజెక్టు కోసం ఆల్రెడీ స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి. లెజెండ్ ని మించిన బడ్జెట్ ని కేటాయించబోతున్నారు. మొత్తానికి ప్రేక్షకులను నిను వీడని నీడను నేనే అనే తరహాలో వెంటపడుతున్న శరవణన్ హిట్టొచ్చే దాకా ఇలా తీస్తూనే ఉంటారేమో.